బనగానపల్లె రూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి రథ వసంతోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఉదయం శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి గణపతి పూజ, సాయంత్రం అంకుర్పాణ, పంచాగ శ్రవణం కార్యక్రమం జరిగింది. సాయంత్రం పన్నేరపు బండ్లు తిప్పుట, ప్రాకార రథం ఊరేగింపు కార్యక్రమం కనుల పండువగా సాగింది. కార్యక్రమంలో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున్న వచ్చి తిలకించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందివర్గం ఎస్‌ఐ భూపాలుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వివాహిత ఆత్మహత్య
పాములపాడు: మండలంలోని ఇస్కాల గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లీలావతి (30 భర్త మధు మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడు. పలుమార్లు భార్య వారించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ విషయంలో రెండురోజుల క్రితం ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన లీలావతి ఈనెల 18న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆత్మకూరులో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడ కోలుకోలేక బుధవారం మృతి చెందింది. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రమణ తెలిపారు.


