తుగ్గలి: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్–2026 పరీక్ష ఫలితాల్లో తుగ్గలి మండలం జొన్నగిరి షేక్ మునీర్ 5వ ర్యాంక్ సాధించాడు. 933 స్కోర్ తెచ్చుకోగా ఈ ర్యాంకు లభించిందని ఆయన తెలిపారు. మునీర్ తండ్రి అల్లాబకాష్ గ్రామంలో పంచర్‌షాపు, తల్లి హమీదా టైలరింగ్ చేస్తోంది. మునీర్ 1వరకు స్వగ్రామంలో, 2 నుంచి 10వరకు గుత్తి సెయింట్ మేరీ, ఇంటర్, బీటెక్ ఇడుపులపాయలో చదివాడు. తర్వాత గేట్ పరీక్షలకు ప్రిపేరైన ఈ విద్యార్థి జియో మాటిక్స్ ఇంజినీరింగ్‌లో జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్ సాధించాడు. సివిల్స్ సాధించి ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని మునీర్ తెలిపారు. కొడుకు ర్యాంక్ సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం గర్వకారణమని పలువురు అభినందనలు తెలిపారు.


