● ఉత్సవాలకు 1800 మంది సిబ్బందితో బందోబస్తు ● ఎనిమిది సెక్టార్లుగా విభజించి పర్యవేక్షణ ● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్
శ్రీశైలం: ఉగాది ఉత్సవాల నేపథ్యంలో శ్రీగిరికి బందోబస్తుపై వచ్చిన పోలీసు సిబ్బంది సంయమనంతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. సోమ వారం నుంచి ఉగాది ఉత్సవా లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికార, సిబ్బందికి ఆదివారం సాయంత్రం వన్‌టౌన్ సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది ఉత్సవాల బందోబస్తుగా వివిధ జిల్లాల నుంచి 1,800 మంది పోలీస్ సిబ్బంది చేరుకున్నారన్నారు. సిబ్బందిని ఎనిమిది సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్‌కు ఒక ఉన్నతాధికారిని నియమించి నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగ మించడానికి ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాలు 24 గంటలూ క్షేత్రం చుట్టూ తిరుగుతూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు భక్తులు సహకరించాలన్నారు. భక్తుల క్యూలైన్లు సాఫీగా సాగి దర్శనం చేసుకునేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులకు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందజేయాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశంలో ఉండాలని, రిలీవర్ వచ్చేంత వరకు వేచి ఉండాలని సూచించారు, బందోబస్తుపై వచ్చిన పోలీసులకు ఏమైనా సమస్యలు ఉంటే పోలీస్ వాట్సాప్ గ్రూపులో సమాచారం చేరవేయాలని ఆదేశించారు. సమావేశంలో యాక్షన్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు, ఆత్మకూరు డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు.


