● దిగువ అహోబిలంలో వైభవంగా గరుడోత్సవం
ఆళ్లగడ్డ: శ్రీ మహావిష్ణువుకు నిత్య వాహనమైన గరుత్మండిపై శ్రీ లక్ష్మీనారసింహుడు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. దిగువ అహోబిలంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారు జామువరకు గరుడోత్సవం కనుల పండువగా సాగింది. అహోబిలేశుని బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటి నుంచి పది రోజుల్లో వచ్చే భక్తులు ఈ ఒక్కరోజే అహోబిలం చేరుకుంటారు. స్వామిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లిస్తారు. ఈ రోజు కోసం ఏడాది పొడువునా వేచి ఉంటారు. బుధవారం తెల్లవారు జామునుంచే దిగువ అహోబిలం దేవాలయం ప్రాంగణం భక్త జనసందోహంతో కిటకిటలాడింది. ఉదయం ఉత్సవమూర్తులను కోనేరు దగ్గరకు తోడ్కొని వెళ్లి తీర్థవారి చక్రస్నానం, సాయంత్రం ద్వాదశారాధనం, రాత్రి పుష్పయాగం నిర్వహించారు. అర్ధరాత్రి అనంతరం ఉత్సవమూర్తి అయిన శ్రీ ప్రహ్లాదవరద స్వామి వజ్రవైడూర్యాలు, బంగారు ఆభరణాలు ధరించి గరుడవాహనంపై అధిష్టించి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. గరుడోత్సవంలో పాల్గొని స్వామిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ, విదేశాలకు చెందిన భక్తులు తరలి వచ్చారు. దిగువ అహోబిలంలో భక్తుల గోవిందా నామస్మరణ మర్మోగింది.


