ఆళ్లగడ్డలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం | - | Sakshi
Sakshi News home page

ఆళ్లగడ్డలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం

Mar 6 2026 8:09 AM | Updated on Mar 6 2026 8:09 AM

మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి

ఆళ్లగడ్డ: దేశం మొత్తం అంబేడ్కర్‌ రచించిన రాజ్యంగం నడుస్తుంటే ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌ నారాలోకేశ్‌ రచించిన రెడ్‌బుక్‌ రాజ్యంగం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అఖిలప్రియ ముఖ్య అనుచరుల చేతిలో హత్యాయత్నానికి గురై నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు శివరామిరెడ్డిని గురువారం ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గతేడాది డిసెంబర్‌ 31వ తేదీ శివరామిరెడ్డి క్రషర్‌ను పెట్రోల్‌ పోసి కాల్చేందుకు యత్నించారన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కోర్టు పరిధిలో ఉన్న క్రషర్‌లో విలువైన సామగ్రి ఎత్తుకుపోతున్నారని, చర్యలు తీసుకోవాలని రిజిష్టర్‌ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. అప్పట్లో ఎస్పీని కలిసి కూడా వివరాలు చెప్పినప్పటికీ ఎలాంటి ఫలితం లభించలేదన్నారు. ఇప్పుడు ఏకంగా హత్య చేసేందుకు యత్నించారన్నారు. మొదట్లోనే చర్యలు తీసుకుని ఉంటే ఇంతదూరం వచ్చేది కాదని అన్నారు.

చూస్తూ ఊరుకోం

దాడులు చేసి బెదిరించాలని చూస్తే అలాంటి తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడేది ఉండదని గంగుల అన్నారు. ఫ్యాక్షన్‌ గొడవలతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా జీవిస్తున్నాయన్నారు. దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది ఉండదని హెచ్చరించారు. ఉదయం దాడి జరిగితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు తటపటాయించారన్నారు. ఐదుసార్లు రాసిన ఫిర్యాదు చించి తమకు అనుకున్నట్లు రాసేలా ఒత్తిడి చేయడం ఎంతవరకు సబబో చెప్పాలని ప్రశ్నించారు. చూస్తుంటే మనిషి ప్రాణం కంటే పోలీసులకు పోస్టింగే ఎక్కువగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పటి వరకు చాకలి శీనును, గోవిందపల్లె ప్రతాపరెడ్డిని చంపాలని ప్రయత్నించారన్నారు. ఇప్పుడు శివరామిరెడ్డిని చంపేందుకు యత్నించారన్నారు. ఇంత అరాచాకం జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement