చంద్రబాబూ.. మతవిశ్వాసాలతో ఆటలొద్దు
● గుంటూరులో స్వాధీనం చేసుకున్న
వక్ఫ్ భూములు వెనక్కివ్వండి
● పీజీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
ఫిర్యాదు
బొమ్మలసత్రం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మత విశ్వాసాలతో చెలగాటమాడుతున్నారని, ఇది మంచిది కాదని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వం గుంటూరు జిల్లా చిన్న కాకాని గ్రామంలో అంజుమాన్ ఏ ఇస్లామియా సంస్థకు చెందిన 71 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థకు చెందిన భూములను తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సోమవారం ముస్లిం నాయకులతో కలసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా, జిల్లా పార్టీ ఉపాధ్యాక్షులు దాల్‌మిల్ అమీర్, మేధావుల సంఘం జిల్లా అధ్యక్షులు రసూల్ ఆజాద్, నాయకులు గన్నీకరీమ్, కౌన్సిలర్లు ఆరీఫ్, కలామ్, బాషిద్ తదితరులతో కలసి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. చిన్నకాకానిలో ముస్లిం మత సంస్థ పేద ముస్లింల అవసరార్థం 71.52 ఎకరాల భూమి ఉంచిందన్నారు. అయితే చంద్రబాబు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు పేరుతో ఆభూమిని స్వాధీనం చేసుకోవడం అన్యాయమన్నారు. ఇలాగే ఇతర మతాలకు చెందిన భూములను రాబోయే రోజుల్లో చంద్రబాబు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటారని, అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. మత విశ్వాసాలను దెబ్బ తీస్తూ మత సంస్థలకు చెందిన భూములు స్వాధీనం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ముస్లింలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.


