బస్సు ప్రమాదంపై ప్రత్యేక బృందం విచారణ
కర్నూలు: కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద అక్టోబర్ 24న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని ప్రభుత్వం నియ మించిన ప్రత్యేక బృందం పరిశీలించింది. బృందం అధ్యక్షుడిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ జనార్ధన్ రెడ్డి, రిటైర్డ్ అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎస్‌ఏవీ ప్రసాదరావు, మరో ఐదుగురు సభ్యుల బృందం శుక్రవారం కర్నూలుకు వచ్చి బస్సు అగ్నిప్రమాద ఘటనపై వివరాలు సేకరించారు. రవాణా, పోలీ సు, అగ్నిమాపక శాఖ, నేషనల్ హైవే అథారిటీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలోని రోడ్డు పరిస్థితి, పరిసరాలు, కాలిపోయిన బస్సును తనిఖీ చేశారు. మరొక స్లీపర్ బస్సును తెప్పించి పరిశీలించారు. కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహానికి ప్రత్యేక బృందం సభ్యులు చేరుకోగానే కలెక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా అధికారులతో ప్రతినిధి బృందం ప్రత్యేక సమావేశం నిర్వహించి అగ్నిప్రమాద ఘటనపై విచారణ జరిపి రిపోర్టు తీసుకున్నారు. రవాణా శాఖ కర్నూలు డిప్యుటీ కమిషనర్ శాంతకుమారి, నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ తరుణ్ కుమార్ (అనంతపురం), జిల్లా ఫైర్ ఆఫీసర్ అవినాష్ జయసింహ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు పలువురు అధికారులు పాల్గొన్నారు.


