‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం
● కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది ● నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి
నంద్యాల: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచి సత్తా చూపిద్దామని వైఎస్సార్‌సీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి అన్నారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు కష్టపడి పనిచేయాలన్నారు. కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్‌లో నంద్యాల నియోజకవర్గస్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశానికి వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నంద్యాల పరిశీలకులు భూమా కిశోర్‌రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పీపీనాగిరెడ్డి హాజరయ్యారు. సమావేశంలో శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘దోచుకో, దాచుకో, పంచుకో’అన్న రీతిన రాష్ట్రంలో చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. సంపద సృష్టిస్తామంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 18 నెలల కాలంలోనే రూ.3లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చాక వాటి అమలు చేయలేదని విమర్శించారు.
రాష్ట్రంలో అరాచక పాలన
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని శిల్పా విమర్శించారు. నంద్యాలలో టీడీపీ నేతలకు డబ్బులు ఇస్తేనే అభివృద్ధి పనులు చేస్తున్నారని విమర్శించారు. రైతులకు యూరియా పంపిణీలో కూడా రాజకీయాలు అంటగట్టి తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. రాజకీయాల పేరు చెప్పుకొని రేషన్ డీలర్, పొదుపు లీడర్‌లను, అంగన్‌శాడీ పోస్టులను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధికారం చేతిలోకి వచ్చాక అక్రమాలు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండబోదని, టీడీపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు దేశం సుధాకర్ రెడ్డి, పీపీ మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సాయినాథ్ రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ జీవీ రమణ, మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా, నంద్యాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు బెక్కెం రామసుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రహ్లాద రెడ్డి, ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్థర్ సైమన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, డాక్టర్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టీవై శివయ్య, నంద్యాల జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనీల్ అమృతారాజ్, మాజీ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పురుషోత్తమ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
గ్రామాల్లో అశాంతి
ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ పేరుతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారించి గ్రామాల్లో అశాంతి రాజేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందన్నారు. మహిళా ఎస్‌ఐపైనే దాడులకు పాల్పడ్డం ఏమిటని ప్రశ్నించారు. నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు భూమా కిశోర్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయ శాఖ మంత్రి ఇలాఖాలో న్యాయమే లేదని, మట్టి , ఇసుక , మద్యం ఇతర పనుల్లో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు.
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం


