నల్లమలలో విజృంభిస్తున్న ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ | - | Sakshi
Sakshi News home page

నల్లమలలో విజృంభిస్తున్న ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌

Jan 22 2026 7:44 AM | Updated on Jan 22 2026 7:44 AM

నల్లమలలో విజృంభిస్తున్న ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌

నల్లమలలో విజృంభిస్తున్న ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌

అన్ని చర్యలు తీసుకుంటున్నాం

ఆత్మకూరు రూరల్‌: అడవి పందుల పాలిట మృత్యువుగా చెప్పుకునే ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ నల్లమలలో తిరిగి విజృంభిస్తోంది. నాగార్జునసాగర్‌–శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలోని పెద్దనంతాపురం సెక్షన్‌లో నందుల ఈరన్న, జడలయ్య బేస్‌ క్యాంప్‌ పరిధిలో వారం రోజులుగా అడవి పందులు మృత్యువాత పడుతున్నాయి. బైర్లూటి ఎఫ్‌ఆర్‌వో కృష్ణ ప్రసాద్‌ చనిపోయిన కొన్ని అడవి పందులకు పోస్టుమార్టం చేయించి పరీక్షల కోసం సంబంధిత ల్యాబ్‌కు పంపించారు. ప్రాథమికంగా కనిపించిన లక్షణాలను బట్టి ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌తోనే మరణించినట్లు భావిస్తున్నారు. రెండేళ్ల కిందట శ్రీశైలం అటవీ రేంజ్‌ పరిధిలో అడవి పందులు, ముఖ్యంగా పిల్లలు కుప్పలుతెప్పలుగా మరణించాయి. అప్పట్లో కూడా మరణాలకు ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవరే కారణమని గుర్తించారు. ఆ సందర్భంగా దీన్ని వైల్డ్‌ లైఫ్‌ మెడికల్‌ ఎమర్జెన్సీగా ప్రభుత్వం గుర్తించింది.

నంద్యాలలో పందుల మరణాలు

జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలోని ఓ వ్యక్తికి చెందిన పందుల ఫారంలోని 40 పందుల్లో 30 ఇటీవల హఠాత్తుగా మరణించినట్లు తెలుస్తోంది. ఇవి ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ వల్లే చనిపోయాయా అన్న అనుమానంతో అటవీ అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ఆత్మకూరు, వెలుగోడు పట్టణాల పరిధిలోని గ్రామాల్లో పందుల పెంపకందారుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు.

వైరస్‌ నల్లమలకు చేరిందిలా..

బైర్లూటి రేంజ్‌లో అడవి పందులు మరణించిన సంగతి తెలియగానే ఫుట్‌ పెట్రోలింగ్‌ను పెంచాం. మరణాల సంఖ్య పెరుగుతుందేమోనన్న విషయాన్ని పరిశీలిస్తున్నాం. ప్రాథమిక అంచనా మేరకు వీటి మరణానికి ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవరే కారణంగా భావిస్తున్నాం. ఇది అడవిలో ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా శానిటేషన్‌ చేపడుతున్నాం.

– విగ్నేష్‌అపావ్‌, డిడి, ప్రాజెక్ట్‌ టైగర్‌, ఎన్‌ఎస్‌టిఆర్‌

పందులలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌(ఏఎస్‌ఎఫ్‌) వైరస్‌కు కారణం శ్రీశైలం ఆలయ పట్టణానికి ఆనుకుని ఉండే సున్నిపెంట గ్రామంలోని పెంపుడు పందుల ఫారాలేనని గతంలో తేలింది. బెంగళూరు తదితర నగరాల నుంచి పెంపకానికి తీసుకొచ్చిన సీమ పందులలో ఉన్న ఏఎస్‌ఎఫ్‌ వైరస్‌ వారి ఫారాలలో ఉన్న ఊర పందులకు సోకినట్లు తెలుస్తోంది. అవి అడవిలో మేతకు వెళ్లినపుడు అడవిపందులకు వ్యాప్తి చెందినట్లు వన్యప్రాణి వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్‌ సోకిన పందులు అంతర్గత రక్తస్రావంతో(ఇంటర్నల్‌ బ్లీడింగ్‌)కూడిన జ్వరంతో అతి వేగంగా మరణానికి చేరువవుతాయి. ఇది మనుషులకు, ఇతర వన్యప్రాణులకు సంక్రమించదని సమాచారం. ఈ ఫీవర్‌కు నేరుగా చికిత్స లేకపోయినా, వైరస్‌ విస్తరించకుండా శానిటేషన్‌ చేయించడం ఒక్కటే మార్గంగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement