నమో.. నారసింహా
ఆళ్లగడ్డ: పార్వేట ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉత్సవమూర్తులు జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వామి యాదవాడ గ్రామంలో కొలువు దీరారు. గ్రామ పొలిమేర తెలుపుపై కొలువైన ఉత్సవమూర్తులకు గ్రామ ప్రజలు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు భుజాలపై పల్లకీని మోసుకుంటూ తెలుపులపై కొలువుంచారు. పారువేట ఉత్సవాల్లో భాగంగా 16వ తేదీన కొండదిగిన ఉత్సవ పల్లకి ఆళ్లగడ్డ మండలం పూర్తి చేసుకుని బుధవారం రాత్రికి రుద్రవరం మండలంలోకి ప్రవేశించింది. ఆలమూరు గ్రామంలో తెలుపుపై ఉత్సవ పల్లకీని కొలువుంచి స్వామిని ప్రజలు దర్శించుకున్నారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి శంకర్‌నాయక్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మూడు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. మొత్తం 9,544 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్ ఎగ్జామినర్లకు 22న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తామని చెప్పారు.
రేబిస్‌తో యువకుడు మృతి
కర్నూలు(హాస్పిటల్): కుక్కకాటుతో రేబిస్ బారినపడి ఓ యువకుడు మృతి చెందిన ఘ టన నంద్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బనగానపల్లె మండలం జమ్ములదిన్నె గ్రామానికి చెందిన టి.హరిగోపాల్(25) మూడు నెలల క్రితం కుక్కకాటుకు గురయ్యాడు. కుక్క కరిచినా అతను వ్యాక్సిన్ వేసుకోకపోవడంతో ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. కుటుంబసభ్యులు ఈ నెల 19న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. ఆసుపత్రిలోని అంటువ్యాధుల విభాగంలో చికిత్స పొందుతున్న అతను బుధవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మల్టీపర్పస్ గోదాములతో ఆదాయం
కర్నూలు(అగ్రికల్చర్):జిల్లాలో నిర్మించిన మల్టీపర్పస్ గోదాములను సద్వినియోగం చేసుకొని ఆదాయం పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కో–ఆపరేటివ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ శ్యామ్‌కుమార్ తెలిపారు. గోదాములను శాసీ్త్రయంగా వినియోగించుకోవడం ఎలా అనే అంశంపై జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో సహకార సంఘాల సీఈఓల కు నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్టీపర్పస్ గోదాములు సహకార సంఘాలకు ఆస్తులని, వీటిని చక్కగా వినియోగించుకుంటే సంఘాలను లాభాల బాట పట్టించవచ్చన్నారు. రైతులు పండించిన వివిధ పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. గోదాముల్లో నిల్వ చేసిన ఉత్పత్తుల నాణ్యత దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత సంఘాల సీఈఓలదేనని, శాసీ్త్రయ పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సునీల్‌కుమార్, జిల్లా సహకార ఆడిట్ అధికారి చెన్నమ్మ పాల్గొన్నారు.


