నిర్లక్ష్యం శాపమై.. బీమా దూరమై
● జిల్లాలో 1.77 లక్షల హెక్టార్లలో రబీ పంటలు సాగు ● గడువు ముగుస్తున్నా పత్తాలేని బీమా చెల్లింపు ప్రకటన ● ప్రీమియం చెల్లింపునకు ఇంకా ప్రారంభం కానీ పోర్టల్ ● ఈ నెలాఖరు వరకే గడువు ● ఆందోళనలో రైతులు
కోవెలకుంట్ల: రైతులతో చంద్రబాబు సర్కార్ చెలగాటమాడుతోంది. ఓ వైపు ఉచిత పంటల బీమాను అటకెక్కించిన ప్రభుత్వం మరో వైపు రైతులే ప్రీమియం చెల్లిందామనుకున్నా పోర్టల్‌ను ప్రారంభించకుండా చోద్యం చూస్తోంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది రబీ సీజన్‌లో 1.77 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో 53,801 హెక్టార్లలో పప్పుశనగ, 11,603 హెక్టార్లలో మినుము, 29,413 హెక్టార్లలో జొన్న, 36,139 హెక్టార్లలో వరి, 1,749 హెకార్టలో వేరుశనగ పంటలు సాగయ్యాయి. గత ఏడాది నుంచి రబీ సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటలకు రైతులే ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద 2025 రబీసీజన్‌కు సంబంధించి పప్పుశనగ, జొన్న, మినుము, పెసర, వేరుశనగ పంటలకు బీమా వర్తింప చేస్తూ ప్రకటన జారీ చేసింది. వ్తితనం వేసినప్పటి నుంచి పైరు వివిధ దశల్లో తుపాన్లు, కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందనుంది. వాతావరణ అంశాల ఆధారంగా సంబంధిత పంట నష్టాన్ని అంచనా వేసి బీమా పరిహారం చెల్లిస్తారు. ఎంపిక చేసిన పంటలను సాగు చేసి నిర్ణీత సమయంలో బీమా చెల్లించి పంటల వివరాలు నమోదు చేసుకున్న కౌలు రైతులతో సహా రైతులందరూ బీమా పథకానికి అర్హులు. గత ఏడాది అక్టోబర్ నెలలో సంభవించిన మోథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా వరి, మిరప, పత్తి, కంది, మినుము, తదితర పంటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోయారు. దెబ్బతిన్న పంటలపై నష్టపరిహారం అంచనా వేసి వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఇప్పటి వరకు రైతులకు పంట నష్ట పరిహారం అందలేదు. అసలు వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.
రబీ బీమా చెల్లింపుపై
నీలినీడలు:
రబీ సీజన్‌కు సంబంధించి పంటల బీమా చెల్లించడానికి ఇంత వరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నెల క్రితం ఏఏ పంటకు ఎంతెంత బీమా చెల్లించాలనే ప్రకటన విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రైతులు ఆయా పంటలకు ప్రీమియం ఎప్పుడు చెల్లించాలో చెప్పలేదు. మరో పదిహేను రోజుల్లో ఈ ఏడాది రబీ సీజన్ ముగియనుంది. జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన రైతులు బీమా చెల్లింపుకు ఎదురు చూస్తున్నారు. అసలు ఏ కంపెనీ పేరుమీద ప్రీమియం చెల్లించాలో రైతులకు తెలియని పరిస్థితి నెలకొంది. మీ సేవ, రైతుసేవా, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు వెళితే బీమా చెల్లింపుకు సంబంధించి పోర్టల్ ఓపెన్ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. పోర్టల్ ప్రారంభమైతే తప్ప ప్రీమియం చెల్లింపు సాధ్యం కాకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నలకు శాపంగా మారింది. ప్రతి ఏటా అక్టోబర్ నెల రబీ సీజన్ ప్రారంభమవుతుంది. నవంబర్ మొదటి వారంలోనే రైతులు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ ముగిసి జనవరి నెల సగం రోజులు కావస్తున్నా బీమా చెల్లింపుకు ప్రకటన రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని రబీ పంటలకు బీమా పథకాన్ని అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.
రైతులను ఆదుకున్న జగన్ సర్కార్:
ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన పంటలకు గత ప్రభుత్వమే ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించడంతోపాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటనష్టం సంభవిస్తే అదే సీజన్‌లో నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకుంది. నంద్యాల జిల్లాలో 2021లో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటనష్టం సంభవించగా 89,199 మంది రైతులకు రూ. 123 కోట్లు, 2022లో 49,637 మంది రైతులకు దాదాపు రూ. 85 కోట్లను ఇన్సురెన్స్ రూపంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. 2022లో పంటకోత ప్రయోగం (దిగుబడి ఆధారంగా) 34.9 కోట్ల పరిహారం, వాతావరణ ప్రభావంతో రూ. 50.14 కోట్ల పరిహారం మంజూరైంది.
ఈ ఏడాది ఎకరా రూ. 16 వేలు కౌలు చెల్లించి రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని రబీ సీజన్‌లో పప్పుశనగ పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, తదితర పెట్టుబడుల రూపంలో ఇప్పటి వరకు రూ. 15 వేలు వెచ్చించాను. ప్రస్తుతం పైరు పూత, పిందె దశలో ఉంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ప్రీమియం చెల్లించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు అవకాశం కల్పించలేదు.
– ప్రతాప్‌రెడ్డి, రైతు, భీమునిపాడు,
కోవెలకుంట్ల మండలం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రభుత్వమే పంటల బీమాకు సంబంధించి ప్రీమియం కట్టేది. అతివృష్టి, అనావృష్టి, తదితర ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం జరిగితే అదే సీజన్‌లో నష్ట పరిహారం చెల్లించేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రబీసీజన్ పంటలకు రైతులే ప్రీమియం చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది 60 ఎకరాల్లో పప్పుశనగ, జొన్న పంటలు సాగు చేశాను. ఇప్పటి వరకు పంటల బీమా చెల్లించేందుకు పోర్టల్ ఓపెన్ కావడం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్ట సంభవిస్తే మా పరిస్థితి ఏమిటి.
– గోవిందరెడ్డి, రైతు, గుంజలపాడు, కోవెలకుంట్ల మండలం
కోవెలకుంట్ల సమీపంలో రబీలో సాగైన పప్పుశనగ
జిల్లాకు ఇన్సూరెన్స్ వర్తింపు ఇలా (రూ. కోట్లలో)


