శివయ్యా.. తోవ చూపవయ్యా! | - | Sakshi
Sakshi News home page

శివయ్యా.. తోవ చూపవయ్యా!

Jan 20 2026 11:05 AM | Updated on Jan 20 2026 11:05 AM

శివయ్యా.. తోవ చూపవయ్యా!

శివయ్యా.. తోవ చూపవయ్యా!

ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతి

రోజులు పెంచని అటవీశాఖ

భక్తుల మనోభావాలను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

నల్లమల అడవిలో అన్నదానాలకు సైతం బ్రేక్‌

శ్రీశైలంటెంపుల్‌: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీగిరి సిద్ధమవుతుంది. ఉత్సవాలకు ముందే ప్రతి ఏటా నల్లమల అటవీప్రాంతం నుంచి లక్షలాది మంది భక్తులు శివనామస్మరణ చేసుకుంటూ పాదయాత్రగా శ్రీశైలం వెళ్లేవారు. కొండలు, గుట్టలు దాటుకుంటూ సుమారు 40 కిలోమీటర్లు నడిచేశా రు. అయితే ఈ ఏడాది అటవీశాఖ పాదయాత్రపై ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే నల్లమల అడవిలో పాదయాత్రకు పలు నిబంధనలతో అనుమతి ఇచ్చింది. దీంతో నల్లమల అటవీప్రాంతంలో భక్తుల శివనామస్మరణ మూగబోనుంది. అటవీశాఖ నుంచి అనుమతి ఇప్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.

పది రోజుల ముందు నుంచే పాదయాత్ర

శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల ప్రారంభానికి పది రోజుల ముందే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది సామాన్య భక్తులు, శివమాల స్వీకరించిన వారు నల్లమల అటవీప్రాంతం గుండా పాదయాత్ర చేసుకుంటూ శ్రీగిరి చేరుకుంటారు. బ్రహ్మోత్సవాల కంటే ముందుగా భక్తుల పాద యాత్ర ప్రారంభమై మహాశివరాత్రి రోజు వరకు జరుగుతుంది. ప్రతి ఏటా పలువురు భక్తులు కాలినడకన వస్తామని మల్లన్నకు మొక్కుకుని తరలివస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతించారు.

వృద్ధులు, మహిళలు సైతం

మల్లన్నపై భక్తితో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు పాదయాత్ర చేసుకుంటూ శ్రీగిరి చేరుకుంటారు. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర గోసాయికట్ట వీరాంజనేయస్వామి గుడి, నాగలూటి వీరభద్రస్వామి దేవాలయం, దామెర్లకుంట, పెద్దచెరువు, కత్తులకొండ, సీతమ్మబావి, మఠంబావి, భీమునికొలను, కై లాసద్వారం అక్కడి నుంచి హఠకేశ్వరం, సాక్షిగణపతి మీదుగా శ్రీశైలం చేరుకుంటుంది. మొత్తం నల్లమల అటవీప్రాంతంలో నడవాల్సి ఉంటుంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలలో వృద్ధులు, మహిళలు సైతం బెదరకుండా నడుచుకుంటూ శ్రీగిరి చేరుకుంటారు. అటవీప్రాంతంలో మొత్తం 40 కిలోమీటర్లు పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. సామాన్య భక్తులతో పాటు శివమాల స్వీకరించిన వృద్ధులు, మహిళలు, చిన్నారులు సైతం శ్రీగిరి చేరుకుంటారు.

అన్నదానాలు రద్దు

నల్లమల అటవీప్రాంతంలో పాదయాత్ర భక్తుల సౌకర్యార్థం ప్రతి ఏటా పలువురు అన్నదానం చేస్తారు. నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కై లాసద్వారం వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు ముందు నుంచే అటవీప్రాంతంలో సేవా కార్యక్రమాల పేరుతో అన్నదాన వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది అన్నదాన కార్యక్రమాలకు కూడా కొన్ని రోజులు బ్రేక్‌ పడనుంది.

అనుమతి ఇప్పించడంలో విఫలమైన చంద్రాబాబు ప్రభుత్వం

నల్లమల అటవీప్రాంతంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పాదయాత్ర చేయడం భక్తుల మనోభావాలతో ముడిపడిన విషయం. అయితే చంద్రాబాబు ప్రభుత్వం భక్తుల మనోభావాలను సైతం పట్టింకోకుండా వ్యవహరిస్తోంది. అటవీప్రాంతంలో పాదయాత్రకు అటవీశాఖ నుంచి అనుమతి ఇప్పించడంలో విఫలమైంది. లక్షలాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన విషయమైనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement