మూగజీవాలకూ.. మందుల్లేవ్
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని
పశుసంపద వివరాలు
కర్నూలు(అగ్రికల్చర్): పశువైద్యానికి ఏడాదిగా మందులు సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. అత్యవసర వైద్యం అందించే సంచార పశువైద్య కేంద్రాలను నామమాత్రానికి పరిమితం చేసింది. పశువైద్యానికి మందుల్లేవని, వెంటనే సరఫరా చేయాలని పశువైద్యులు కోరుతున్నా.. పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు మందులు సరఫరా చేసిన దాఖలాలే లేవు. పశువైద్య శిబిరాలు నిర్వహించాలంటే అనేక రకాల మందులు అవసరం. కేవలం నట్టల నివారణ మందులు మినహా ఇతరత్రా మందులు లేవు. మందులే లేనపుడు ఉచిత పశువైద్య శిబిరాల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులే పేర్కొంటున్నారు.
రోజుకొక పంచాయతీ ప్రకారం
ఈ నెల 19 నుంచి 31 వరకు పంచాయతీల వారీగా పశువైద్య శిబిరాలు నిర్వహించడానికి పశుసంవర్ధక శాఖ చర్యలు తీసుకుంది. కర్నూలు జిల్లాలో 484, నంద్యాల జిల్లాలో 489 పంచాయతీల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించనుంది. పశువైద్య శిబిరాలను పర్యవేక్షించేందుకు పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్‌లో జాయింట్ డైరెక్టర్ అయిన డాక్టర్ దుర్గాప్రసన్నబాబు ఉమ్మడి జిల్లాకు స్పెషల్ అధికారిగా నియమితులయ్యారు. పశువైద్యశాలలు కర్నూలు జిల్లాలో 66, నంద్యాల జిల్లాలో 74 ఉన్నాయి. ప్రతి వైద్యశాల పరిధిలో రోజు ఒక పంచాయతీ ప్రకారం శిబిరం నిర్వహిస్తారు.
సరఫరా కాని మందులు
ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహణకు కనీసం యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, లివర్ టానిక్‌లు, ఆవు లు, గేదెలు ఎదకు రావడానికి అవసరమైన మందులు ఉండాలి. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. గొర్రె లు, మేకలకు పీపీఆర్, హెచ్‌ఎస్ టీకాలు వేయాల్సి ఉంది. ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ మందులేవి సరఫరా చేయలేదు. వైద్య శిబిరాల్లో గర్భకోశ వ్యాధులకు చికిత్స చేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మందులు మాత్రం సరఫరా కాలేదు. గొర్రెలు, మేకలు, దూడలు, పెద్ద పశువులకు కేవలం నట్టల నివారణ మందులు మాత్రమే సరఫరా అయ్యాయి. నట్టల నివారణ మందులతో పశువైద్య శిబిరాలు నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందని వెటర్నరీ అసిస్టెంటు సర్జన్స్, అసిస్టెంటు డైరెక్టర్స్ వాపోతున్నారు.
తెల్ల జాతి పశువులు 3,56,541
నల్ల జాతి పశువులు 4,20,882
గొర్రెలు 19,85,868
మేకలు 6,10,669
కోళ్లు 12,89,417
నేటి నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు
మందులు సరఫరా చేయని
చంద్రబాబు ప్రభుత్వం
తూతూమంత్రానికే పరిమితమైన
సంచార పశువైద్యశాలలు


