అరటి తోటల్లో దొంగలు
అర్ధరాత్రి గెలలు కోసుకుపోతున్న వైనం లబోదిబోమంటున్న రైతులు
మహానంది: దొంగలు పంట పొలాల్లోని మోటార్లు, విద్యుత్ తీగలు అ పహరించడం చూ శాం. కానీ దొంగలు రూటు మార్చి రైతు ల కడుపులు కొడుతున్నారు. అరటి తోటలపై దొంగలు కన్నేసి గెలలు కోసుకుపోతున్నారు. మహానంది మండలంలో ప్రధానంగా సాగయ్యే పంటల్లో అరటి ముఖ్యమైనది. ఇటీవల ధరలు తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం అరటి కిలో రూ. 18 నుంచి రూ. 22 వరకు ఉంది. దీంతో కొద్దిగా లాభాలు వస్తాయనుకునే తరుణంలో దొంగలు ఇదే అదనుగా భావించి రైతుల పొలాల్లోని అరటి గెలలను కోసుకెళ్తున్నారు. మహానంది, తిమ్మాపురం సమీపంలోని తెలుగుగంగ పదవ బ్లాక్ పరిధిలో సాగు చేస్తున్న రైతుల పొలాల్లో గెలలు చోరీకి గురవుతున్నాయి. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన యర్రగుంట్ల రమేష్, పగడాల నాగరాజు, అబ్బీపురం వెంకటేశ్వరరెడ్డి, పుట్టుపల్లె సాలన్న, మురళీధర్‌రెడ్డి, తదితర రైతులకు చెందిన పొలాల్లో దొంగలు అర్ధరాత్రి వేళ వచ్చి చెట్లను విరుస్తూ అరటి గెలలను కోసుకుపోయారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు స్పందించి అరటి పొలాల్లో చోరీలకు పాల్పడినవారిని పట్టుకుని రైతులకు అండగా నిలవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


