ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(టౌన్): జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా సదన్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలను జిల్లా కోర్టు వెబ్‌సైట్ www.ecourts.kurnool.com అలాగే kurnool.dcourts.gov.in లో చూసుకోవచ్చన్నారు. ఈ నెల 27న సాయంత్రం 6 గంటల్లోపు జిల్లా కోర్టు కాంపౌండ్‌లో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అడ్రస్ పేరుతో రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ దరఖాస్తులు పంపాలని పేర్కొన్నారు.
ఎల్లెల్సీకి నీటి సరఫరా బంద్
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు గురువారం టీబీ బోర్డు అధికారులు నీటి సరఫరాను నిలిపేశారు. దీంతో శుక్రవారం ఆంధ్ర పరిధిలోని హొళగుంద సెక్షన్ దిగువ కాలువలో 70 శాతం మేర నీటి సరఫర తగ్గుముఖం పట్టింది.
వీఆర్‌ఎస్‌పీ సమీపంలో చిరుత పులులు
ఆత్మకూరు: వరదరాజస్వామి ప్రాజెక్టు (వీఆర్‌ఎస్‌పీ) సమీపంలోని రహదారులపై మూడు చిరుత పులులు ఒకటి వెంట ఒకటి కూర్చుంటూ కలియ తిరుగుతూ కనిపించాయి. ఈ సమయంలో వాహనదారులు సౌండ్ హారన్ వేయడంతో ఒకదాని వెంట ఒకటి అడవిలోకి పరుగులు తీశాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వీఆర్‌ఎస్‌పీని చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.వాహనాలను వెనక్కి మళ్లించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీఆర్‌ఎస్‌పీ నీటిపారుదల సంఘం అధ్యక్షులు కురుకుంద మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల చిరుతనపులు అధికంగా సంచరిస్తున్నాయని, అటవీశాఖ అధికారుల అనుమతి తీసుకుని పర్యాటకులు వెళ్లాలన్నారు.
చేపల వలలో కొండచిలువ
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పాములపాడు మండలం ఇస్కాల గ్రామ సమీపంలోని నీటికుంటలో చేపల వలకు భారీ కొండచిలువ చిక్కింది. గురువారం ఇస్కాల సమీపంలోని ఎత్తిపోతల పంప్ హౌస్ వద్దనున్న నీటికుంటలో చేపలకోసం వల వేశారు. ఇందులో ఓ కొండచిలువ చిక్కుకున్నట్లు గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఆ మేరకు యాంటీ పోచింగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువకు ఎలాంటి గాయాలు కాకుండా వలను తొలగించి నీటి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం కొండ చిలువను బైర్లూటి రేంజ్‌లోని గంగరాజు చెరువులో వదలి పెట్టారు. యాంటీపోచింగ్ స్క్వాడ్‌లో ఎఫ్‌బివోలు కృష్ణకాంత్, పీరా తదితరులు ఉన్నారు.
ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం


