యూరియా పంపిణీలో ఘర్షణ
● కొత్తపల్లెలో పోలీసుల పికెట్
నంద్యాల(అర్బన్): నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో యూరియా పంపిణీలో ఘర్షణ నెలకొంది. ఇటీవల గ్రామానికి వచ్చిన యూరియా పంపిణీపై టీడీపీ నాయకులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిలదీశారు. రైతులకు ఇవ్వకుండా యూరియా ఎక్కడికి వెళ్తుందంటూ ప్రశ్నించారు. దీంతో వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలను గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దూషించారు. శుక్రవారం టీడీపీ నాయకుడు కుమారుడు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు ప్రతి దాడులు చేసుకునేందుకు ప్రయత్నించడంతో గ్రామంలో వాతావరణం వేడెక్కింది. షయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటను జరగకుండా పికెట్ ఏర్పాటు చేశారు.
తోపులాట
సమస్యాత్మక గ్రామాల్లో ఒకటైన కొత్తపల్లెలో ఏ సంఘటన జరిగినా ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. గత డిసెంబర్‌లో గ్రామ ఎంపీటీసీ హరినాథరెడ్డిపై కొంత మంది టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ సంఘటన మరువక ముందే యూరియా పంపిణీ, చిన్నచిన్న ఘర్షణలతో ఇరువర్గాలు దాడులకు దిగేందుకు యత్నించారు. గ్రామ సచివాలయానికి వ్యవసాయాధికారులు 100 టన్నుల యూరియా మంజూరు చేశారు. అర్హులైన రైతులకు అందించకుండా యూరియా ఎక్కడికి వెళ్తుదంటూ ప్రశ్నించిన వారిపై బెదిరింపులు, దాడులకు దిగుతుండటంతో విధిలేని పరిస్థితిలో బయట కొనుగోలు చేస్తూ పంట సాగు చేపడుతున్నారు. గత మంగళవారం గ్రామానికి 35 టన్నులు యూరియా సచివాలయానికి వచ్చింది. గ్రామ రైతులకు యూరియా పంపిణీ చేయకపోవడంపై టీడీపీ నాయకులు, అధికారులను వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులైన రైతులు ప్రశ్నించారు. అక్కడ మొదలైన వివాదం శుక్రవారం సాయంత్రం గ్రామ టీడీపీ నాయకుడి కుమారుడు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు వాగ్వాదం మొదలై తోపులాటకు దిగారు. ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. జరిగిన సంఘటనపై విచారణ చేపడుతున్నామని బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తాలూకా సీఐ ఈశ్వరయ్య తెలిపారు.


