ఈత ఆకులే ఆభరణాలుగా
నేడు శ్రీగిరిలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం
చెంచులకు భ్రమరాంబాదేవి కూతురు..మల్లికార్జునస్వామి అల్లుడు
చెంచులే అతిథులుగా..
శ్రీశైలంటెంపుల్: నల్లమల అడవిలో నివసించే చెంచులు భ్రమరాంబాదేవిని కూతురుగా, మల్లికార్జునస్వామిని ఇంటి అల్లుడిగా భావిస్తారు. దీంతో బ్రహ్మోత్సవ కల్యాణానికి వారే అతిథులుగా నిలిచి ఈత ఆకులతో ఆభరణాలు తయారుచేసి వాటితో స్వామిఅమ్మవార్లను అలంకరించనున్నారు. మకర సంక్రాంతి రోజే జరిగే ఈ కల్యాణోత్సవానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
స్థానిక గాథ ప్రకారం:
ప్రచారంలో ఉన్న స్థానిక గాథలను బట్టి ఒకానొకసారి పార్వతీదేవికి భూలోకా అందాలను తిలకించాలనే కోరిక కలిగింది. దాంతో అమ్మవారు చెంచు యువతి రూపాన్ని పొంది శ్రీశైలం అటవీ ప్రాంతానికి విచ్చేసింది. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్దురాలైన అమ్మవారు కొంతకాలం శ్రీశైలంలోనే ఉండాలని నిర్ణయించుకుంది. అడవిలో ఒకచోట తన నివాసాన్ని ఏర్పరుచుకుని ఉండసాగింది. చెంచు రూపంలో ఉన్న పార్వతీదేవిని స్థానిక చెంచులు ఆదరిస్తూ ఆమెకు సపర్యలు చేయసాగారు. ప్రతిరోజూ ఆమెకు పాలు, తేనే, పలురకాల అడవిపండ్లు, దుంపలు మొదలైనవాటిని అమెకు ఆహారంగా ఇవ్వసాగారు. ఇక సంతానం లేని ఈ ప్రాంతపు చెంచుదొర దంపతులు అమ్మవారినే తమ సొంత బిడ్డగా భావించి పార్వతీదేవిపై ఎంతో ప్రేమను పెంచుకుంటారు. ఇదిలా ఉంటే అమ్మవారు కై లాసాన్ని వీడిరావడంతో కై లాసమంతా బోసిపోయింది. దాంతో పార్వతీదేవిని వెతుకుంటూ పరమేశ్వరుడు శ్రీశైల అడవికి చేరుకుంటాడు. అమ్మవారిని కలుసుకోవడానికి తాను కూడా చెంచు యువకుడి రూపం ధరిస్తాడు. ఇలా ఇద్దరు కలుసుకొని ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకుని వివాహానికి సిద్ధపడుతారు. అయితే, తనను కన్నబిడ్డగా చూసుకున్న చెంచుదొర దంపతుల అంగీకారం పొందాలని అమ్మవారు స్వామిని సూచిస్తారు. అతను దొర వద్దకు వెళ్లి అడిగితే వివాహమైతే కుమార్తెను భర్తతో పంపాల్సి ఉంటుందని అంగీకరించడు. ఇలా ఎంతకీ చెంచులు వివాహానికి అంగీకరించక పోవడంతో స్వామి అమ్మవారు ఎవరికి చెప్పకుండా వివాహం చేసుకుంటారు. ఆ పెళ్లి జరిగిన రోజే మకర సంక్రాంతి. తరువాత ఆ వివాహాన్ని తెలుసుకున్న చెంచులు చేసేదేమిలేక మహాశివరాత్రి రోజు అందరి సమక్షంలో స్వామిఅమ్మవారికి మళ్లీ పెళ్లి చేస్తారు. ఈ కథ ఆధారంగా శ్రీశైల సంస్కృతి లో చెంచులకు గల విశిష్టస్థానాన్ని గుర్తించిన దేవస్థానం గత కొన్ని సంవత్సరాల నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవ కల్యాణానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది.
పార్వతీ, పరమేశ్వరుల కల్యాణానికి అటవీఆకులతో సిద్ధం చేసిన ఆభరణాలు
కల్యాణానికి సిద్ధమైన పెళ్లి ఆభరణాలు
శ్రీశైలం మేకలబండ చెంచు గూడెంలో నివసిస్తున్న మండ్లి మల్లికార్జున(దేవ చెంచు) స్వామిఅమ్మవార్ల కల్యాణానికి అడవి ఆకులతో ఆభరణాలు సిద్ధం చేశారు. ఈత ఆకులతో అమ్మవారికి మెట్టెలు, గాజులు, మెడలో ధరించేందుకు ఆభరణాలు, బాసికాలు రూపొందించారు. అలాగే స్వామివారికి జంజం, మెడలో ధరించేందుకు ఆభరణం, ఉంగరం, తలంబ్రాలుగా వెదురు బియ్యం ఇలా కల్యాణానికి అవసరమైన అన్ని వస్తువులను ప్రత్యేకంగా సిద్ధం చేశారు.
ఈత ఆకులే ఆభరణాలుగా
ఈత ఆకులే ఆభరణాలుగా


