ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
● గంజిహళ్లిలో రాయలసీమ జోన్ మైనింగ్ అధికారుల విచారణ
గోనెగండ్ల: అధికారుల అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ ఎ. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు హెచ్చరించారు. రెండు రోజుల క్రితం సాక్షి దినపత్రికలో ‘ఆగని ఇసుక దందా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై వారు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం పోలీసులతో కలిసి వారు గంజిహళ్లి హంద్రీనదిలో ఇసుక తవ్వే ప్రాంతాన్ని పరిశీలించారు. హంద్రీనదిలో ఎక్కడెక్కడ ఇసుక కోసం తవ్వకాలు జరిపారు. రోజుకు ఎన్ని ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారని ఆరా తీశారు. హంద్రీలో ఇసుక తరలిస్తున్న ప్రాంతం గాజులదిన్నె ప్రాజెక్టుకు చెందిన భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. అయితే, గంజిహళ్లికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి సొంత భూమి అని ఒక ట్రాక్టర్ ఇసుక రూ.400 చొప్పున అక్రమార్కులకు విక్రయిస్తున్నట్లు మైనింగ్ అధికారులకు తెలియడంతో అతడిని విచారించారు. అనంతనం ఆ అధికారులు మాట్లాడుతూ హంద్రీనదిలో తవ్విన గుంతలను కొలతలు తీసుకున్నామని.. అలాగే శ్రీనివాసులును విచారించిన రిపోర్టును జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. గోనెగండ్ల మండలంలో ఇసుక రీచ్‌కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. అధికారుల అనుమతులు అక్కడ ఇసుక తవ్వకాలు జరపరాదన్నారు.
రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మండలంలోని గంజిహళ్లి హంద్రీనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను బుధవారం పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. తర్వాత వాటిని మైనింగ్ అధికారులకు అప్పజెప్పినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు.


