తండ్రి కర్మకాండకు వెళ్తూ..
● సంతజూటూరు ప్రభుత్వ పాఠశాల టీచర్ నాగన్న మృతి ● ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా ప్రమాదం ● శోకసంద్రంలో బాధిత కుటుంబం
జూపాడుబంగ్లా: తండ్రి కర్మకాండలకు వెళ్తూ కుమారుడు ప్రమాదానికి గురై మృతిచెందాడు. బాధిత కుటుంబంలో విషాదం నింపిన ఈ ఘటన బుధవారం జూపాడుబంగ్లా సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రమైన జూపాడుబంగ్లాకు చెందిన జేమ్స్(చెంచన్న) డిసెంబర్ 31న మృతి చెందాడు. ఈయన కుమారుడైన నాగన్న (50) బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రి కర్మకాండల నిమిత్తం బుధవారం భార్య విజయకుమారితో కలిసి నాగన్న స్వగ్రామమైన జూపాడుబంగ్లాకు బయలుదేరాడు. ఆత్మకూరు ఆర్టీసి బస్టాండులో శ్రీశైలం నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సులో ఎక్కారు. మరో ఐదు నిమిషాల్లో బస్సు జూపాడుబంగ్లా బస్టాండుకు చేరుకుంటుంది. నాగన్న దంపతులు దిగేందుకు ముందుగానే సీట్లోంచి లేచి ఫుట్‌బోర్డుపై నిల్చొన్నారు. కండక్టర్ చంద్రమోహన్ గమనించి అలా నిల్చొ వద్దని ఇరువురిని వారించాడు. అదే సమయంలో హఠాత్తుగా రోడ్డుకు అడ్డంగా గొర్రెలు రావటంతో బస్సు డ్రైవర్ ఆకుల లక్ష్మన్న సడన్ బ్రేక్‌వేశాడు. ఫుట్‌బోర్డుపై నిల్చొన్న నాగన్న బస్సు లోంచి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. అతని పక్కనే నిలబడిన మృతుని భార్య కూడా పడబోతుండగా కండక్టర్ చె య్యి అడ్డుపెట్టడంతో ప్రమాదం తప్పి ంది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యు లు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని బో రున విలపించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ సంజీవ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరుకు తరలించాడు.
తండ్రి కర్మకాండకు వెళ్తూ..


