పాల వ్యాపారి అదృశ్యం
కర్నూలు: కల్లూరు మండలం ఎన్టీఆర్ బిల్డింగ్స్‌లో నివాసముంటున్న పాల వ్యాపారి బ్రహ్మానంద రెడ్డి (26) అదృశ్యమయ్యాడు. తల్లి లక్ష్మిదేవితో కలసి పంచలింగాల వద్ద డైరీ ఫారం ఏర్పాటు చేసుకుని పాల వ్యాపారం సాగిస్తున్నాడు. పంచలింగాల నుంచి రోజూ కర్నూలుకు పాలు తీసుకుని వచ్చి వ్యాపారం సాగించేవాడు. ఈనెల 12న పాలు తీసుకుని కర్నూలుకు వచ్చాడు. అప్పటి నుంచి కనిపించకపోవడంతో తల్లి లక్ష్మిదేవి ఆయన సోదరుడు బ్రహ్మానందరెడ్డితో కలిసి గాలిస్తుండగా నగర శివారులోని తుంగభద్ర బ్రిడ్జి సమీపంలో కేసీ కెనాల్ హైవే పక్కన అతని బైకు కనిపించడంతో స్వాధీనం చేసుకుని మేనమామ మల్లికార్జున రెడ్డి నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాల వ్యాపారి శ్రీకాంత్ రెడ్డితో డబ్బుల విషయంలో మనస్పర్థలు ఉన్నాయని, అతనిపైనే అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో కేసీ కెనాల్ వెంట పాములపాడు వరకు గస్తీ తిరుగుతున్నారు. మూడు రోజులుగా బ్రహ్మానందరెడ్డి కనిపించకపోవడంతో ఎలాగైనా తన కుమారుడిని వెతికి అప్పగించాలని తల్లి లక్ష్మీదేవి పోలీసులను వేడుకుంటోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


