రూ.10 వేల కోట్ల ఆస్తిని కొట్టేసే కుట్ర
కల్లూరు: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్‌పరం చేసి రూ.10వేల కోట్ల ఆస్తిని తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. భోగి పండుగ సందర్భంగా బుధవారం ఆయన కల్లూరులో ఏర్పాటు చేసిన భోగి మంటల్లో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రతులను, పీపీపీ జీవోలను వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ పని చేస్తోందన్నారు. నిరుపేద విద్యార్థుల మెడికల్ కలను సాకారం చేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల నిర్మాణం ప్రారంభించారన్నారు. ఇప్పటికే ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చా యన్నారు. మిగిలిన కళాశాలలను పూర్తి చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం దురుద్దేశంతో పీపీపీ పద్ధతిన ప్రయివేటుపరం చేసే దిశగా అడుగులు వేయడం తగదన్నారు. ఈ నిర్ణయాన్ని విరమించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. మెడికల్ కళాశాలలన్నీ అందుబాటులోకి వస్తే లక్షలాది మంది పేదలకు సూపర్ స్పెషాలిటి వైద్య సేవలు అందడంతో పాటు నిరుపేద విద్యార్థులకు వైద్య విద్య అందు బాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేణుక, రాయలసీమ మహిళ విభాగం అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, కార్పొరేటర్లు లక్ష్మీకాంతరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


