ఎల్లెల్సీలో తగ్గిన నీటి ప్రవాహం
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)లో బుధవారం రెండు అడుగుల వరకు నీటి ప్రవాహం తగ్గింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఎల్లెల్సీకి దాదాపు 1,700 క్యూసెక్కుల నీరు వదులుతుండగా ప్రస్తు తం వెయ్యి క్యూసెక్కుల నీరు మాత్ర మే విడుదలవుతోంది. రెండు, మూడు రోజుల వరకు ఈ విధంగా నీటిని వదులుతూ పూర్తిగా నిలిపి వేసే సూచనలు కనిపిస్తున్నాయి. జలాశయం గేట్ల ఏర్పాటుకు సంబంధించి రబీలో డ్యాం నుంచి వచ్చే ఎల్లెల్సీతో పాటు ఇతర కాలువలకు నీటిని నిలిపివేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఖరీఫ్‌లో సాగు చేసిన వరి, ఇతర పంటలు డిసెంబర్ నెలలో చేతికి రావడంతో బోరు బావులున్న కొందరు రైతులు వరినారు వేసుకున్నారు. కాలువకు ఇంకా నీటి సరఫరా జరుగుతుండడంతో ఎల్లెల్సీ నీటితో మడులను తడిపి సిద్ధం చేసుకున్న రైతులు వరి, ఇతర అరుతడి పంటలను సాగు చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఎల్లెల్సీ కింద ఒక కారు పంటతో సరి పుచ్చుకోవాల్సి రావడంతో బోరుబావులున్న రైతులు రబీ పంట విషయంలో బెంగపెట్టుకున్నారు. టీబీ డ్యాంలో 1633 అడుగులతో 105.788 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి బుధవారం 1604 అడుగులతో 27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో లేకపోగా.. ఔట్‌ఫ్లో 3,474 క్యూసెక్కులు ఉంటోంది.
పిచ్చికుక్క స్వైర విహారం
పాణ్యం: తమ్మరాజుపల్లెలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. రెండు రోజులుగా గ్రామంలో పలువురిపై దాడి చేసి గాయపరిచింది. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. పిచ్చి కుక్క దాడిలో విష్ణు అనే బాలుడికి, మరో మహిళకు, వంట సామగ్రి వ్యాపారం నిమిత్తం వచ్చిన మరో మహిళకు గాయాలైనట్లు సమాచారం. అధికారులు చర్యలు చేపట్టి పిచ్చి కుక్కను తరిమేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


