రాష్ట్ర పార్టీ కమిటీలో సూర్యనారాయణరెడ్డికి స్థానం
బొమ్మలసత్రం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పాణ్యం నియోజకవర్గానికి చెందిన సూర్యనారాయణరెడ్డిని రాష్ట్ర సెక్రటరీ(పార్లమెంట్)గా నియమిస్తున్నట్లు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా ఉపాధ్యక్షుడిగా గత కొంత కాలంగా సూర్యనారాయణరెడ్డి కొనసాగుతున్నప్పటికీ పార్టీ అధిష్టానం రాష్ట్ర కమిటీలో ఆయనకు స్థానం కల్పించింది.
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ ఏడాది ఖరీఫ్‌లో పండించిన కందులను నాఫెడ్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ కర్నూలు బ్రాంచీ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు నాఫెడ్ ఏపీ స్టేట్ హెడ్ వినయ్‌కుమార్ తెలిపారు. సోమవారం మార్కెట్‌లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దతు ధర రూ.8వేలతో కందులను కొనుగోలు చేస్తామన్నారు. నాణ్యత ప్రమాణాల ఆధారంగా అక్కడే రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు కొనుగోలు తేదీ ఇస్తామన్నారు.
సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
కర్నూలు(అర్బన్): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లాలోని 91 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 10, 11వ తేదీల్లో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ల వారీగా గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అయితే అనేక మంది గ్రామ సచివాలయాల ఉద్యోగులు పాల్గొనలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులపై 24 గంటల్లోగా సచివాలయ ఉద్యోగులు సంజాయిషీ ఇచ్చుకోవాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని సీఈఓ హెచ్చరించారు.
సమస్యలను సత్వరం పరిష్కరించాలి
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్‌లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్‌ఈ మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. ఎప్పటికప్పడు సమస్యలను పరిష్కరిస్తే వినియోగదారుల్లో సంతృప్తి రేటు పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


