మోసం చేశారు.. న్యాయం చేయండి
● ఏఎస్పీకి ఫిర్యాదులు అందించిన ప్రజలు
నంద్యాల: అబద్ధపు మాటలు చెప్పి తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబుకు కొందరు ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. బండిఆత్మకూరు మండలం భోజనం గ్రామం పరిధిలో స్థలాన్ని ఇస్తామని రూ.1.50లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేస్తున్నారని, న్యాయం చేయాలని నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన వెంకట నాగేశ్వర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4లక్షలు తీసుకుని మోసం చేశారని డోన్ పట్టణానికి చెందిన దేవా సంతోష్ కుమార్ ఫిర్యాదు చేశారు. వారసత్వంగా వచ్చిన భూమిలో ఇల్లు కట్టుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కబ్జా చేయాలని చూస్తున్న వారి నుంచి స్థలాన్ని కాపాడాలని నంద్యాలకు చెందిన వెంకటేశ్వర్లు కోరారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు పేర్కొన్నారు.


