పింఛన్ ఇవ్వాలి.. వంతెన నిర్మించాలి
● పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు ఇచ్చిన ప్రజలు
నంద్యాల: తన భర్త అనారోగ్యంతో మృతి చెందాడని, తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన రహమత్ బీ అనే మహిళ అర్జీ ఇచ్చారు. తన 0.50 ఎకరాలు రహదారి నిర్మాణంలో పోతోందని, నష్టపరిహారం ఇవ్వాలని కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేటకు తిరుమలగారి కొండయ్యకు వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలో శ్మశానవాటిక వెళ్లే దారిలో వాగు ఉండడంతో ఇబ్బందిగా ఉందని, వంతెన నిర్మించాలని మహానంది మండలం గాజులపల్లె గ్రామస్తులు పత్రం అందజేశారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి డి. రామునాయక్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డీఆర్డీఎ పీడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా స్వీకరించిన 328 అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను డీఆర్‌ఓ డి. రామునాయక్ ఆదేశించారు.


