మాకు పరిహారం ఏదీ?
కర్నూలు(సెంట్రల్): ఉల్లి పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన తమకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని దేవనకొండ మండలం గుడిమిరాళ్ల, బేతపల్లి, చెల్లెలి చెలిమల, కొటకోండ, బండపల్లి తదితర గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో రెవెన్యూ, వ్యవసాయాధికారులు టీడీపీ నాయకులకు ఇచ్చి నిజమైన బాధితులకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. తమకు పరిహారం ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆ గ్రామాల ఉల్లి రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు వకీలు రంగన్న, ప్రకాస్‌రెడ్డి, హనుమంతరెడ్డి, సురేంద్రబాబు, మల్లి, భాస్కర్, విజయుడు, వంశీశెట్టి, గోపాల్, సోమలింగ, షేక్ మహ్మద్‌బాషా, గజ్జెలు శ్రీనివాసులు, బోయ కిష్టన్న, కౌలుట్లయ్య, ఆంజనేయులు, రంగడు మాట్లాడుతూ..తమ గ్రామాల్లో వందల మంది ఉల్లి పండించి ధర లేక తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు మార్కెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన రూ.1200 కూడా రాకపోవడంతో పారబోసి వచ్చామని, అయితే ప్రభుత్వం ఎకరాకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. నష్టపోయిన రైతులకు కాకుండా మండలంలో టీడీపీ నాయకులకు మాత్రమే అందించారన్నారు. పరిహారం మంజూరులో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.జిల్లా అధికారులు స్పందించి నష్టపోయిన రైతుల కు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. కాగా, ఉల్లి రైతులకు ఏపీ రైతు సంఘం నాయకులు వీరశేఖర్, సూరి మద్దతు తెలిపారు. అనంతరం రైతులు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న పీజీఆర్‌ఎస్‌లో తమకు న్యాయం చేయాలని వినతిపత్ర ఇచ్చారు.


