బోడబండలో పట్టపగలు భారీ చోరీ
● 15 తులాల బంగారు ఆభరణాలు
అపహరణ
ఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని బోడబండ గ్రామంలో పట్టపగలు ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళం పగలగొట్టి ఏకంగా 15 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పెద్దనర్సిరెడ్డి అనే వ్యక్తి ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి పొలం పనులకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పొలం పనులు ముగించుకొని వచ్చిన పెద్దనర్సిరెడ్డికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటం, తలుపులు తెరుచుకొని ఉండటంతో లోపలికి వెళ్లి చూశాడు. బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బీరువాలోని 15 తులాల బంగారు చోరీకి గురైందని బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
బోడబండలో పట్టపగలు భారీ చోరీ


