ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
బేతంచెర్ల: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మండల పరిధిలోని సీతారామాపురం మెట్ట వద్ద 340బీ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని యంబాయి గ్రామానికి చెందిన పరమేశ్వరప్ప(55) అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పై బనగానపల్లె మండలం పసుపుల గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. సీతారామాపురం మెట్ట వద్ద కర్నూలుకు వెళ్తున్న కోవెల కుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పరమేశ్వరప్ప తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తర్వాత మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బేతంచెర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కూతురు లావణ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ బాబు తెలిపారు.
బుగ్గరామేశ్వరుడిని దర్శించుకున్న తెలంగాణ జడ్జి
ఓర్వకల్లు: మండలంలోని కాల్వబుగ్గలో వెలసిన బుగ్గరామేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు జడ్జి ప్రవీణ్‌కుమార్ దర్శించుకున్నారు. సోమవారం ఆయన కుటుంబ సమేతంగా కాల్వబుగ్గ దేవస్థానానికి రాగా ఆలయ చైర్మన్ కాటినేని నారాయణ, ఈఓ మద్దిలేటి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి బుగ్గరామేశ్వర స్వామిని దర్శించుకోగా ఆలయ అర్చకులు కళ్లె లక్ష్మీనారాయణ శర్మ వారికి ప్రత్యేక అర్చనలు చేసి ఆశీర్వదించారు.


