ఉల్లి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
● నష్ట పరిహారం జాబితాలో
జిల్లా లేకపోవడం విడ్డూరం
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి
నంద్యాల(అర్బన్): గత ఖరీఫ్‌లో ఉల్లి పంట సాగుతో నష్టపోయిన జిల్లా రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో 5,486.8 హెక్టార్లలో గత ఖరీఫ్ కింద రైతులు ఉల్లి సాగు చేశారన్నారు. దాదాపు 47,250 మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుబడులు వచ్చినట్లు సంబంధిత అధికారులు అంచనా వేశారన్నారు. మరికొంత దిగుబడులు రావాల్సిన సమయంలో వాతావరణం మార్పులతో ఎదుగుదల లేకపోవడం, అదే సమయంలో మార్కెట్‌లో ధర లేకపోవడంతో పంటను రైతులు పొలాల్లోనే వదిలేశారన్నా రు. ఆ పరిస్థితుల్లో సంబంధిత అధికారు లు నష్టపోయిన రైతు ల వివరాలను ప్రభుత్వానికి నివేదించాల్సి ఉందన్నారు. అధికారులు మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఈ ఏడాది ప్రభుత్వం ఉల్లి రైతులకు మంజూరు చేసిన పంట నష్ట పరిహారంలో నంద్యాల జిల్లా లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. ఉద్యానవన శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే పంట నష్ట పరిహారం అందకుండా పోయిందని చెప్పారు. పంట దిగుబడులు లేకపోవడంతో గత సెప్టెంబర్ మాసంలో ప్రభు త్వం క్వింటా రూ.1200కు కొనుగోలు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం కేవలం 5 శాతం ఉల్లిని మాత్రమే కొనుగోలు చేసి, పంట నష్టపరిహారం కింద హెక్టారుకు రూ.50 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే నంద్యాల జిల్లా ఉల్లి రైతులకు పంట నష్టపరిహార సాయం అందించకపోవడం దారుణమన్నారు. పంట నష్ట పరిహారం పంపిణీలో భాగంగా కడప, కర్నూలు జిల్లా రైతులకు హెక్టార్లకు రూ.50 వేలు (ఎకరాకు రూ.20 వేలు), పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసిన కూటమి ప్రభుత్వం నంద్యాల, అనంతపురం జిల్లా రైతులను విస్మరించడం దుర్మార్గమన్నారు. నంద్యాల జిల్లా రైతులకు పంట నష్టపరిహారం కింద రూ.28 కోట్లు రావాల్సి ఉందని, ప్రభుత్వం ఏదో కుంటి సాకు చెబుతూ రైతులను మోసం చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. తక్షణమే రెండు జిల్లాల ఉల్లి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసి ఆదుకోవాలన్నారు.


