కుక్ పోస్టులకు ‘ఉన్నత’ దరఖాస్తులు
● 77 నాన్ టీచింగ్ పోస్టులకు
8,982 దరఖాస్తులు
కర్నూలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో కుక్ పోస్టులకు ఉన్నత విద్యావంతులు (పీజీ చదివిన వారు) సైతం పోటీ పడుతున్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామనే టీడీపీ అధినేత హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఒక్క జ్యాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఇటీవల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, ఏపీ మోడల్ స్కూళ్లలో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 77 పోస్టులు ఉంటే 8,982 దరఖాస్తులు వచ్చాయి. కుక్ పోస్టులకు పీజీ చదివిన వారు సైతం దరఖాస్తు చేసుకోవడం నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది.
ఉన్నత విద్యావంతులు అధికం
జిల్లాలో 26 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాల యాలు, 16 ఏపీ మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఇందు లో 16 కేజీబీవీల్లో అటెండర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్‌మెన్, స్కావెంజర్, స్వీపర్ పోస్టులు 32 ఉన్నాయి. వొకేషన్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు 3, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు 12, ఏఎన్‌ఎం 8 పోస్టులు భర్తీ చేయనుండగా..ఈ పోస్టులు జిల్లా స్ధాయిలో భర్తీ చేయనున్నారు. ఏపీ మోడల్ స్కూళ్ల లో నాలుగు వార్డెన్ పోస్టులు, తొమ్మిది పార్ట్‌టైం టీచర్ పోస్టులు, తొమ్మిది కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్ పోస్టులు మండల స్థాయిలోనే భర్తీ చేయ నున్నారు. కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్ పోస్టులకు ఉన్నత విద్య అభ్యసించిన యువతీ, యువకు లు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.
దళారులుగా మారిన
టీడీపీ నాయకులు
మండల స్థాయిలో భర్తీ చేసే పోస్టులకు భారీగా దరఖాస్తులు రావడంతో టీడీపీ నేతల సిఫారసులు సైతం ఈ పోస్టులకు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యో గుల వద్ద భారీగా డబ్బులు తీసుకుని సిఫారసు లేఖలు తీసుకొచ్చారు. మొత్తం 77 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈ నెల 3న మొదలైన దరఖాస్తు ప్రక్రియ ఆదివారంతో ముగిసింది.


