సీమ నీటి హక్కులను కాలరాయడం తగదు
నంద్యాల(అర్బన్): శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి పేరుతో రాయలసీమ నీటి హక్కులను కాలరాయడం తగదని రాయలసీమ సాగునీటి సాధన సమితి బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని నిరంతరం దిగువకు వదిలే విధానాన్ని తక్షణమే నిలిపి నాగార్జున సాగర్‌కు కేటాయించిన నీటితో మాత్రమే విద్యుత్‌ఉత్పత్తి చేయాలనే నిబంధనను సక్రమంగా అమలు చేయాలన్నారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం సమితి సభ్యులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిగిలిన నీటిని శ్రీశైలంలో నిల్వ ఉంచి రాయలసీమ, దక్షిణ తెలంగాణ అవసరాలకు వినియోగించాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుల్లో పూడిక కారణంగా ఇప్పటికే 90టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని, భవిష్యత్తులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా సిద్దేశ్వరం అలుగు నిర్మాణంతో పూడిక నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు కీలకమైన ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని వెంటనే చేపట్టాలన్నారు. సీమ అభివృద్ధిని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువులు కుంటల పునరుద్ధరణ అత్యంత కీలకమన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక నిధులను సీమలోనే పూర్తిగా వినియోగించాలన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు ఎర్రం శంకర్‌రెడ్డి, వెంకటేశ్వరనాయుడు, మహేశ్వరరెడ్డి, సుధాకర్‌రావు పాల్గొన్నారు.


