దుకాణాలలో చోరీ
ఓర్వకల్లు: రెండు వేర్వేరు దుకాణాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానిక ఆర్టీసీ బస్టాండుకు సమీపంలో మస్తాన్ కిరాణం దుకాణం, దామోదరం అనే వ్యక్తి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ పక్కన స్టేషనరీ షాపు నడుపుతున్నారు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి షాపులకు తాళం వేసుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో మస్తాన్ దుకా ణం తాళం పగులగొట్టి రెండు బియ్యం బస్తాలు, రూ.3 వేల నగదు, దామోదరం దుకాణంలో రూ.1300, స్టేషనరీ సామగ్రి అపహరించారు. ఆదివారం ఉదయం చోరీలు వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కంటి ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్
కర్నూలు(హాస్పిటల్): ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ఆదివారం ఆక్సిజన్ పైప్‌లైన్‌లో లీక్ ఏర్పడింది. ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి కంటి ఆసుపత్రికి వెళ్లే ఆక్సిజన్ పైప్‌లైన్ ప్రధాన ద్వారం సమీపంలో లీక్ కావడంతో సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే అప్రమత్తమై మరమ్మతులకు చర్యలు ప్రారంభించారు. ఆక్సిజన్ లీకేజీని అరికట్టేందుకు నిపుణులను పిలిపించారు. మధ్యాహ్నం వరకు శ్రమించి లీకేజీని అరికట్టడంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం కావడం, కంటి ఆసుపత్రిలో ఆక్సిజన్ అమర్చిన రోగులు ఎవ్వరూ లేకపోవడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు.


