పేదల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి చల్లా మధుసూదన్‌రెడ్డి
బొమ్మలసత్రం: రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దుపోకడలను నిలదీస్తూ సామాన్య, పేదల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని రాష్ట్ర సమన్వయ కార్యదర్శి చల్లా మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వైఎస్సార్‌సీపీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు.. గ్రామ స్థాయిలో ముఖ్యమైన కార్యకర్తలను వివిధ కమిటీల ద్వారా ఎంపిక చేసుకోవాలని సూచించారు. వారి ఫొటోలను సేకరించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపితే గుర్తింపు కార్డు అందజేస్తామని వివరించారు. ఈ ప్రక్రియను జిల్లాలో నేటి నుంచి 45 రోజుల్లోగా టాస్క్‌ఫోర్స్ పేరుతో వేగంగా చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు, పట్టణ, నియోజకవర్గ స్థాయి కమిటీల నియామకం చేపట్టి త్వరితగతిన వారికి పార్టీ నుంచి ఒక గుర్తింపు కార్డును అందిస్తామన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలను సమన్వయం చేసుకుంటూ కమిటీల ఏర్పాటు ప్రక్రియను ఎప్పటికప్పుడూ కేంద్ర పార్టీ కార్యాలయానికి సమాచారం అందిస్తామని వివరించారు. రానున్న రోజుల్లో పార్టీ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్రకార్యదర్శి దేశం సుధాకర్‌రెడ్డి, బుడ్డా శేషిరెడ్డి, గుండం సూర్యప్రకాష్‌రెడ్డి, ఎస్‌ఈసీ మెంబర్లు పీపీ నాగిరెడ్డి, గోపవరం సాయినాథ్‌రెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి, చల్లా విఘ్నేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు సూర్య నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


