కొండెక్కిన గుడ్లు, చికెన్ ధరలు
● హోల్‌సేల్‌లో వంద కోడిగుడ్ల ధర రూ.740 ● కిలో చికెన్ రూ. 260 నుంచి రూ.300 ● రిటైల్‌గా కోడిగుడ్డు ఒక్కటి రూ.9 పైమాటే
గోస్పాడు: ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ కోవలోకే చేరాయి. చికెన్, గుడ్లు. జిల్లాలో దాదాపుగా 2వేల పైగా చికెన్ సెంటర్లు ఉండగా, మరిన్ని కిరాణ కొట్లలో గుడ్లను విక్రయిస్తునారు. జిల్లాలో దాదాపుగా రోజుకు నాలుగు లక్షలకు పైగా గుడ్లు అమ్ముడుపోయేతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
పరుగులు పెడుతున్న గుడ్ల ధరలు...
మార్కెట్లో గుడ్ల ధర ఎన్నడూ లేనంతగా పరుగులు పెడుతోంది. రెండు నెలల క్రితం నుంచి ప్రారంభమైన ధర నేటికీ ఆగడం లేదు. బహిరంగ మార్కెట్‌లో ధరలు ఒకలాఉంటే మారుమూల గ్రామాల్లో గుడ్ల ధరలు కొంత అధికంగా ఉంటున్నాయి. నెల క్రితం 30 గుడ్ల ధర రూ.170 నుంచి రూ.180 వరకు (ఒక్క గుడ్డు రూ. 6) ఉండింది. కాగా.. ప్రస్తుతం వంద గుడ్ల ధర రూ.740గా ఉంది. మార్కెట్లో రూ.8 నుంచి రూ.9 వరకు విక్రయిస్తున్నారు. ఇక్కడికి హైదరాబాద్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి కోళ్లు,గుడ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.
చికెన్ ధరకు రెక్కలు..
హోల్‌సేల్ వ్యాపారుల వద్ద కిలో చికెన్ ధర రూ.260 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. గ్రామా ల్లోని వ్యాపారులు రూ.330 వరకు విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో మాంసాహార ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.


