వసంత పంచమికి భారీ ఏర్పాట్లు
కొత్తపల్లి: నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన సరస్వతి క్షేత్రమైన కొలనుభారతిలో ఈనెల 23న వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఆర్డీఓ నాగజ్యోతి కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కొలనుభారతి ఆలయం శ్రీశైల దేవస్థానంలో కలిసిన తర్వాత జరుగుతున్న తొలి వసంత పంచమి కావడంతో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా తాగునీరు, క్యూలైన్లు, మహిళలకు ప్రత్యేక గదులు, చిన్నారులకు అక్షరాభ్యాస ఏర్పాట్లు, పార్కింగ్ సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆలయ చైర్మన్ వెంకటనాయుడు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, ఎంపీడీఓ మేరి, తహసీల్దార్ ఉమారాణి పాల్గొన్నారు.


