నల్లమలలో ఎర్రమట్టి తవ్వకాలు!
మహానంది: దర్జాగా ప్రకృతి వనరులు కొల్లగొడుతున్న తెలుగు తమ్ముళ్లపై ప్రజలు కన్నెర్ర చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తుండటంతో అడ్డుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నంద్యాల – గిద్దలూరు రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహానంది, శిరివెళ్ల మండలాల సరిహద్దులోని మహదేవపురం గ్రామ సమీపంలోని పోలేరమ్మ రస్తా ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ నేతలు ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు 15 టిప్పర్లు, జేసీబీతో యథేచ్ఛగా తవ్వేస్తుండటంతో మహదేవపురం ప్రజలు అడ్డుకున్నారు. ఎర్రమట్టిని తరలిస్తూ పొలం రస్తాలను ధ్వంసం చేస్తే ఎలా వెళ్లాలంటూ ప్రజలు రోడ్డెక్కారు. అర్ధరాత్రి చలిని సైతం లెక్క చేయకుండా తవ్వకాలను అడ్డుకున్నారు. పొలాలకు, సర్వనరసింహస్వామి ఆలయానికి వెళ్లేందుకు సౌకర్యంగా ఉన్న రస్తా మట్టి అక్రమార్కుల జేసీబీల కారణంతో ధ్వంసమవుతుందన్నారు. ఎన్ని సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తమకు సంబంధం లేదంటూ దాటవేస్తున్నారని గ్రా మస్తులు ఆరోపించారు. అయితే టిప్పర్లను అడ్డు కునేందుకు వెళ్లిన వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకు బౌన్సర్లను పంపుతూ బెదిరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా బేఖాతర్..
పోలేరమ్మ రస్తాలో జరుగుతున్న ఎర్రమట్టి తవ్వకాలపై రెండు వారాల క్రితం ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి(నాని) ఆధ్వర్యంలో జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాను కలిసి వినతిపత్రం అందించారు. దీంతో స్పందించిన అధికారులు నామమాత్రంగా దాడులు నిర్వహించి కేవలం రెండు ఎర్రమట్టి టిప్పర్లను మాత్రమే సీజ్ చేసి అధికార భక్తిని చాటుకున్నారు. అనుమతులు ఉంటే అర్ధరాత్రి మట్టి తవ్వకాలు ఎందుకు జరపాలంటూ పలువురు విమర్శిస్తున్నారు. మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతుల్లేవని మండల అధికారులే చెబుతున్నారన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి పూర్వం నుంచి ఉన్న పోలేరమ్మ రస్తాను ధ్వంసం చేయడం తగదన్నారు.
అర్ధరాత్రి అడ్డుకున్న మహదేవపురం ప్రజలు
నల్లమలలో ఎర్రమట్టి తవ్వకాలు!


