● మాజీ ఐఏఎస్ అధికారి, సీడబ్ల్యూసీ సభ్యులు కొప్పుల రాజ
వైఎస్సార్ హయాంలో ఒక మోడల్‌గా ఉపాధి హామీ పథకం
కర్నూలు(అర్బన్): ఏపీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గొప్పగా అమలు చేసిన చరిత్ర దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని మాజీ ఐఏఎస్ అధికారి, సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు అన్నారు. వైఎస్సార్ హయాంలో ఏపీలో ఉపాధి హామీ పథకం ఒక మోడల్‌గా అమలు చేశారన్నారు. శనివారం కర్నూలులోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌ను రద్దు చేయరాదనే డిమాండ్‌పై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బీకేఎంయూ పతాకాన్ని సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు భీమలింగప్ప ఆవిష్కరించారు. కొప్పుల రాజు మాట్లాడుతూ..ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు ఒక కుట్ర దాగి ఉందన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ మాట్లాడుతూ ‘పనైనా చూపండి–తిండైనా పెట్టండి’ అనే నినాదంతో చేసిన పోరాట ఫలితమే ఈ చట్టం అన్నారు. ఈ నెల 14న భోగి మంటల్లో కొత్త పథకం ప్రతులను దగ్ధం చేయాలని, 30న సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని తీర్మానించారు.


