అడవి జంతువులు రావొచ్చు.. అప్రమత్తంగా ఉండాలి
● జీఐఎఫ్‌ఎస్ డిప్యూటీ డైరెక్టర్
శ్రీశైలం: పాతాళగంగ మెట్ల మార్గం పరిసర ప్రాంతాలకు అడవి జంతువులు రావొచ్చునని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ డీడీ విగ్నేష్ అప్పావ్ సూచించారు. శుక్రవారం సాయంత్రం శ్రీశైలంలోని పాతాళగంగ మెట్ల మార్గం పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసితులతో ఆయన సమావేశమయ్యారు. అటవీ ప్రాంతం నుంచి చిరుత పులు నివాసిత ప్రాంతాల్లో ఉన్న కుక్కలను వేటాడడానికి కోసం వస్తాయని తెలిపారు. భవిష్యత్తులో అడవి జంతువులు నివాసిత ప్రాంతాల్లోకి వచ్చి వ్యక్తులపై దాడి చేసే అవకాశం ఉందని, ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో జంతువులకు కలుగుతున్న ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. సమావేశంలో శ్రీశైలం సబ్ డీఎఫ్‌ఓ లలిత కుమారి, దోర్నాల సబ్ డీఎఫ్‌ఓ నీరజ్, శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
‘టెట్’లో 39.27 శాతం ఉత్తీర్ణత
నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో జిల్లాలో 39.27 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా డిసెంబర్ నెల 10 నుంచి 21వ తేదీ నిర్వహించిన పరీక్షలకు 2,48,420 మంది హాజరయ్యారన్నారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 97,560 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని ఏపీ టెట్ కన్వీ నర్ వెంకటకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెట్‌కు 31,886 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు హాజరు కాగా వారిలో 47.82 శాతం(15,239) మంది ఉత్తీర్ణలయ్యారని తెలిపారు. ఫలితాలను 9552300009 వాట్సాప్ నంబరు ద్వారా కూడా తెలుసుకోవచ్చన్నారు.
ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్ట్‌కు శుక్రవారం చిలకలూరిపేటకు చెందిన ఇ.లక్ష్మీ తేజశ్విని రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు కె.అయ్యన్నకు అందించారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు.
నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హల్‌చల్
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పట్టణంలో రెండురోజులుగా ఒక వ్యక్తి తాను ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను అని శ్యాంపుల్ చెక్ చేయాలంటూ బేకరీలు, స్వీట్ షాపులు, హోటళ్ల వద్ద హల్‌చల్ చేశాడు. అంతే కాకుండా రెండువేల రూపాయలు ఇవ్వాలని బెదిరించి వసూలు చేసినట్లు తెలిసింది. అయితే ఈయన వ్యవహారం కొంచెం అనుమానాస్పదంగా ఉండటంతో పట్టణంలోని ప్రముఖ స్వీట్‌షాపు యజమాని నిలదీయడంతో అసలు విషయం తెలిసింది. నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అక్కడ నుంచి జారుకున్నాడు.
దొర్నిపాడు: పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ జనార్ధన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని డబ్ల్యూగోవిందిన్నె గ్రామంలోని జెడ్పీ ఉన్నత, ఎంపీపీ స్కూళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికలో భాగంగా రోజూ నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఆరా తీశారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. పరీక్షలకు సంబంధించి ఎదైనా అనుమానం ఉంటే వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. గతేడాది వంద శాతం ఫలితాలు సాధించడంతో ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సారి వందశాతం ఉత్తీర్ణత వచ్చేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ మనోహర్‌రెడ్డి, హెచ్‌ఎం దస్తగిరి తదితరుల పాల్గొన్నారు.
అడవి జంతువులు రావొచ్చు.. అప్రమత్తంగా ఉండాలి


