ఫిబ్రవరి 8 నుంచి ఇరుముడి స్వాములకు స్పర్శదర్శనం
శ్రీశైలం టెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే ప్రతి భక్తుడికి ఆహ్లదకరమైన వాతావరణంలో సౌకర్యవంతమైన స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 8 నుంచి 12వ తేది వరకు ఇరుముడి కలిగిన శివస్వాములకు మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తామని.. 8 నుంచి 18వ తేదీ వరకు సామాన్య భక్తులకు అలంకార దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. శుక్రవారం శ్రీశైల దేవస్థానంలోని కమాండ్ కంట్రోల్ రూంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధ్యక్షతన కర్నూలు, నంద్యాల, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లా అన్ని శాఖల అధికారులతో మొదటి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే 20శాతం మంది భక్తులు అదనంగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పాదయాత్రగా భక్తులను దృష్టిలో ఉంచుకొని అటవీమార్గంలో మెడికల్ క్యాంప్‌లు, అంబులెన్స్‌లు, డస్ట్‌బిన్లు, టాయిలెట్లు, చలువపందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వరకు రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 7లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, అన్ని శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. ఈలోగా మరో రెండు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు 3వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో చోటుచేసుకున్న లోటుపాట్లను సరిదిద్దుకుంటూ పటిష్ట చర్యలు చేపడతామన్నారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఆత్మకూరు డివిజన్ అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నెష్ అప్పావ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 8వ తేది నుంచి అటవీప్రాంతంలో పాదయాత్రకు అనుమతిస్తామన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా బ్రహ్మోత్సవాల్లో 2లీటర్లు, 5లీటర్ల వాటర్ బాటిల్స్‌ను మాత్రమే అనుమతిస్తామన్నారు.


