రెడ్ బుక్‌ను ప్రకాశం బ్యారేజ్‌లో ముంచుతాం
● నంద్యాలలో విద్యార్థి, యువజన సంఘాల నేతల ధర్నా
నంద్యాల(న్యూటౌన్): ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తే రెడ్‌బుక్‌ను ప్రకాశం బ్యారేజీలో ముంచుతామని యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. బొమ్మలసత్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సూర్యప్రతాప్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు నాగరాముడు, వైఎస్సార్‌సీపీ యువజన నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి రాంబాబు మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తే యువజన, ప్రజా సంఘాల నాయకులపై కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి నిరుద్యోగ, విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. కేసులు ఎత్తి వేసేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. విద్యార్థి, యువజన ప్రజా సంఘాల నాయకులు ప్రతాప్, ధనుంజయుడు, శశిధర్‌రెడ్డి, ఎర్రిస్వామి, వైఎస్సార్‌సీపీ విభాగం నాయకులు మధు, పాములేటి తదితరులు పాల్గొన్నారు.


