ఒక్క పాఠశాల మూతపడినా ఒప్పుకోం
● జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి
కొలిమిగుండ్ల: సరైన పర్యవేక్షణ లేక కొలిమిగుండ్ల మండలంలో తొమ్మిది పాఠశాలలు విలీనానికి సిద్ధంగా ఉన్నాయని, ఒక్క పాఠశాల మూతపడినా ఒప్పుకునేది లేదని జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కారపాకుల నాగవేణి అధ్యక్ష్యతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు రెండు సమావేశాలకు గైర్హాజర్ కావడంపై జెడ్పీ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య శాలలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపాలని ఎంపీడీఓ దస్తగిరిబాబును ఆదేశించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి చెందిన మినరల్ వాటర్ గ్రామాలకు కాకుండా అల్ట్రాటెక్ సిమెంట్ ప్యాక్టరీలో ఎందుకు అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరియా ఇవ్వడం లేదు
యూరియా ఇవ్వడం లేదని, ఎద్దుకు చికిత్స చేయాలని 1962కు ఆరు సార్లు ఫోన్ చేస్తే ఆంబులెన్స్‌కు డీజల్ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి గౌరవ వేతనం అందలేదని, వాటిని ప్రభుత్వం వాడుకుంటుందా అని ఎంపీటీసీ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కొలిమిగుండ్లను కరువు మండలంగా ప్రకటించి ఏడాది అయినా రైతులకు రూపాయి సాయం అందలేదని మీర్జాపురం సర్పంచ్ లాయర్ మహేశ్వరెడ్డి విమర్శించారు.


