నాలుగు నెలల క్రితమే ప్రమీలమ్మ మృతి
● సాక్షి కథనంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ● కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
చాగలమర్రి: ముత్యాలపాడు ఎస్సీ కాలనీ 4వ అంగన్‌వాడీ కేంద్రం కార్యకర్త అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. సాక్షి కథనంతో అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ‘ప్రమీల ఆచూకీ ఎక్కడ?’ అన్న శీర్షికన ఈ నెల 3వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఐసీడీఎస్ అధికారులు గురువారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఒక రోజులోనే అనుమానాలకు తెరదించారు. అంగన్‌వాడీ కార్య కర్త ప్రమీల అనారోగ్యంతో సెలవుల్లో వెళ్లి తిరిగి రాలేదు. గత 9 నెలలుగా విధులకు హాజరుకాకపోవడం, ఆమెకు కుటుంబీకులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ అధికారులు నోటీసులు పంపి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఆచూకీపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అటు ఐసీడీఎస్, ఇటు పోలీసులు అధికారులు రంగంలోకి దిగి చివరకు ప్రమీలమ్మ చనిపోయినట్లు గుర్తించారు. ముందుగా ఆమె అనారోగ్యానికి గురైనప్పుడు గ్రామానికి చెందిన కొంతమంది ఆమెను చికిత్స కోసం ఆటోలో చాగలమర్రిలోని కేరళ ఆసుపత్రికి తరలించినట్లు గుర్తించి, ఆ మేరకు విచారణ చేపట్టారు. ఈ విచారణలో మెరుగైన వైద్యం కోసం ఆమె కడప పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రికి వెళ్లిందని తెలుసుకుని హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, అంగన్‌వాడీ కార్యకర్త చంద్రకళ రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి విచారించారు. అయితే ప్రమీల అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక గతేడాది సెప్టెంబర్ 3వ తేదీన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతదేహాన్ని ఐదు రోజుల పాటు మార్చురీలో ఉంచగా ఎవరూ రాక పోవడంతో మున్సిపాలిటీకి అప్పగించి దహనం చేయించినట్లు తెలిసింది. అంగన్‌వాడీ కార్యకర్త ప్రమీలమ్మ అనాథగా మృతి చెందడంతో గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.


