ప్రేమ జంట ఘటనపై విచారణ
శిరివెళ్ల: స్థానిక పోలీసు స్టేషన్ వద్ద ఈ నెల 8వ తేదీన జరిగిన సంఘటన పరిణామాలపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మండల కేంద్రం శిరివెళ్లకు చెందిన రెండు సామాజిక వర్గాలకు చెందిన ప్రేమ జంట వ్యవహారం ముదిరి దాడులకు దారి తీసింది. రక్షణ కోరి స్టేషన్‌కు వచ్చిన జంట వ్యవహారాన్ని రాజీ చేసేందుకు కొందరు ప్రయత్నించినా కుదరలేదు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారు భారీ సంఖ్యలో స్టేషన్‌కు వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు జంటను వేర్వేరు పోలీస్ వాహనాల్లో తరలించారు. అయితే అబ్బాయిని తరలించే పోలీస్ వాహనంపై కొంత మంది రాళ్లు రువ్వడంతో పోలీస్‌లు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై శుక్రవారం జిల్లా అడిషనల్ ఏస్పీ యుగంధర్‌బాబు స్టేషన్‌కు చేరకుని సీఐ దస్తగిరిబాబును విచారణ చేశారు. అనంతరం రాళ్లు పడిన వాహనాన్ని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ప్రధాన కూడలిలో స్పెషల్ పార్టి పోలీస్‌లను నియమించారు. పోలీస్ బందోబస్తును అడిషనల్ ఏస్పీ పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండంగా ఘటనలో పోలీస్ వాహనంపై ఎవ్వరు రాళ్లు రువ్వారు, ఎంత మంది ఉన్నారన్న దానిపై పోలీస్‌లు విచారణను ముమ్మురం చేశారు. కార్యక్రమంలో డీఏస్పీ ప్రమోద్, ఎస్‌ఐ మధుసూదన్ పాల్గొన్నారు.
యువకుడి ఆత్మహత్య
వెలుగోడు: పట్టణంలోని గొల్లపేటకు చెందిన గాజా రవి (29) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గాజా రవి వెలుగోడులో ఓ పాల డైయిరీ తరఫున డిస్ట్రిబ్యూటర్‌గా షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 9 గంటలకు దుకాణం నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడి తల్లి గాజా మల్లీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.


