గ్రామీణ బ్యాంకుల్లో ప్రైవేటు పెట్టుబడులు వ్యతిరేకించాలి
నంద్యాల(వ్యవసాయం): ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ప్రైవేటు పెట్టుబడులను వ్యతిరేకిస్తూ శుక్రవారం గ్రామీణ బ్యాంక్ రీజనల్ కార్యాలయం ఎదుట బ్యాంకు సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకులు సుజీత్ మాట్లాడుతూ.. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు, సూక్ష్మ వ్యాపారులకు తక్కువ వ్యయంతో రుణాలు అందించే సమగ్ర గ్రామీణాభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పడ్డాయన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రామీణ బ్యాంకులను మార్చి 2026 చివరి నాటికి ప్రైవేటు పెట్టుబడులకు సంబంధించిన ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేసి సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ఒత్తిళ్లకు లోబడి ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా రంగంలో వాటాల విక్రయానికి పాల్పడ్డాయని విమర్శించారు. ఇప్పుడు గ్రామీణాభివృద్ధికి వెన్నుదన్నుగా ఉన్న గ్రామీణ బ్యాంకులు కూడా ప్రైవేటు పెట్టుబడులు పెట్టాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు రవితేజారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.


