పులుల అంచనాకు శివభక్తులు సహకరించాలి
ఆత్మకూరు రూరల్: జాతీయ పెద్దపులుల అంచనా కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరుగుతోందని, శ్రీశైల మల్లన్న భక్తులు అటవీశాఖతో సహకరించి తాము సూచించిన తేదీల్లో మాత్రమే అడవిలో పాదయాత్రకు సిద్ధపడాలని డిడి విగ్నేష్ అపావ్ కోరారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం ఎన్‌టిసిఏ ఆధ్వర్యంలో కొనసాగుతుందన్నారు. ప్రొటోకాల్ ప్రకారం జరిగే కార్యక్రమం కావడంతో మార్పు చేయడానికి వీలుపడదన్నారు. అందు వల్ల మహాశివరాత్రికి వచ్చే భక్తులు ఫిబ్రవరి 8 నుంచి 15వ తేదీ వరకు మాత్రమే వెంకటాపురం నుంచి నాగలూటి ద్వారా పాదయాత్ర చేసుకోవచ్చన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గురువారం బైర్లూటిలో అన్నదాన నిర్వాహకులతో సమావేశమై తగు సూచనలు చేశామన్నారు. సూచించిన రోజుల్లో పాదయాత్రకు వచ్చే భక్తులు తమ వెంట ప్లాస్టిక్ కవర్లు తీసుకురావద్దన్నారు. అలాగే పొగాకు ఉత్పత్తులు, మద్యం సీసాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు. విలేకరుల సమావేశంలో సబ్ డీఎఫ్‌ఓ బబిత పాల్గొన్నారు.


