‘దారి’తప్పిన తమ్ముళ్లు! | - | Sakshi
Sakshi News home page

‘దారి’తప్పిన తమ్ముళ్లు!

Jan 9 2026 7:34 AM | Updated on Jan 9 2026 7:34 AM

‘దారి’తప్పిన తమ్ముళ్లు!

‘దారి’తప్పిన తమ్ముళ్లు!

పనులు పూర్తి కాకుండా అధికారులపై ఒత్తిళ్లు

70 శాతం పనులు పూర్తయినా ఎంబుక్‌ రికార్డుకు ససేమిరా

రికార్డుల్లో కేవలం జంగిల్‌ క్లియరెన్స్‌ చేసినట్లు నమోదు

పనులు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు

కర్నూలు(అర్బన్‌): వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రహదారుల నిర్వహణపై ఒంటి కాలిపై లేచిన కూటమి నేతలు నేడు రహదారుల నిర్మాణాలు పూర్తికాకుండా ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. నంద్యాల జిల్లాలోని గోస్పాడు నుంచి జిల్లెల్ల మీదుగా కామినేనిపల్లి వరకు రీ కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ రోడ్‌ వర్క్‌ కింద రూ.3 కోట్ల అంచనాతో 7.95 కిలోమీటర్ల రోడ్డు వేసేందుకు గత ఏడాది జూలై 4న అగ్రిమెంట్‌ చేసుకున్నారు. నాబార్డు ఆర్‌ఐఎఫ్‌డీ–30 నిధులతో చేపట్టిన పనులను ఈ ఏడాది జూన్‌ 3 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించి రోడ్లకు ఇరువైపులా జంగిల్‌ను క్లియరెన్స్‌ చేయించి, డబ్ల్యూఎంఎం పనులు కూడా పూర్తి చేశారు. దాదాపు 70 శాతం మేర పూర్తయిన పనులకు అనుగుణంగా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ఎంబుక్‌ రికార్డు చేయాల్సి ఉంది. అయితే, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో సంబంధిత పీఆర్‌ ఇంజనీర్లు ఈ రోడ్డు పనులను నేటి వరకు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఎంబుక్‌ రికార్డు చేసిన అనంతరం క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు చేసిన పనులపై క్వాలిటీని చెక్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డబ్ల్యూఎంఎం రోడ్డుపై బీటీ వేయాల్సి ఉంది. కాగా, పీఆర్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రాంట్ల కింద చేపట్టిన పనులకు సంబంధించిన నివేదికల్లో ఈ రోడ్డు పనులు దాదాపు 70 శాతం పూర్తయినా జంగిల్‌ క్లియరెన్స్‌ మాత్రమే చేసినట్లు నమోదు చేయడం చూస్తే అధికార పార్టీ ఒత్తిళ్లు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది.

15 కి.మీలు తగ్గనున్న దూరం

ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే మండల కేంద్రమైన గోస్పాడు నుంచి తిరుపతి జాతీయ రహదారికి వెళ్లేందుకు 15 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. గోస్పాడు నుంచి జిల్లెల్ల మీదుగా కామినేనిపల్లికి 8 కిలోమీటర్లు, కామినేనిపల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని గోవిందపల్లి మీదుగా కర్నూలు – తి రుపతి జాతీయ రహదారికి చేరుకోవచ్చు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు ప్రస్తుతం గోస్పాడు నుంచి నంద్యాల మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాల్సి వస్తోంది.

ఎంబుక్‌ రికార్డు చేయకుండా అధికారులపై ఒత్తిళ్లు

గోస్పాడు నుంచి జిల్లెల్ల మీదుగా కామినేనిపల్లి వరకు రోడ్డు నిర్మించేందుకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లను తొలగించి ( జంగిల్‌ క్లియరెన్స్‌ ) డబ్ల్యూఎంఎం పనులు పూర్తి చేశారు. అయితే స్థానిక తెలుగుదేశం నేతలు జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ఇంజనీరింగ్‌ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి చేసిన పనులకు అనుగుణంగా ఎంబుక్‌ రికార్డు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఎంబుక్‌ రికార్డు చేయకపోవడం, క్యూసీ చెక్‌ చేయకపోవడం వల్ల డబ్ల్యూఎంఎం రోడ్డుపై బీటీ వేయలేని పరిస్థితి ఏర్పడింది. 7.95 కిలోమీటర్ల మేర డబ్ల్యూఎంఎం వేసి వదలేయడంతో ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎంబుక్‌ రికార్డు చేయకపోవడంపై కాంట్రాక్టర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

గోస్పాడు–కామినేనిపల్లి రోడ్డుకు రాజకీయ గ్రహణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement