ఎత్తిపోతల పూర్తి చేస్తావా?
రేవంత్ మాటలకు కట్టుబడతావా,
జూపాడుబంగ్లా: ఇప్పటికే రాయలసీమ ద్రోహిగా మారిన చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడతవా, రాయలసీమ ఎత్తిపోతలను పూర్తి చేస్తావా అని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రశ్నించారు. గురువారం ఆయన ఏపీ రైతుసంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య, కేసీకాల్వ రైతు సంఘం అధ్యక్షుడు చంద్రమౌళీశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, వైఎస్సార్ కడప జిల్లా కార్యవర్గ సభ్యుడు గాలిచంద్ర, అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యుడు మహేష్ తదితరులతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ పక్కనున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వార్థరాజకీయాల కోసం నీటి వివాదాలు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు ఎడాపెడా నీటిని వాడుకుంటున్నా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. శ్రీశైలం డ్యాంకు వరదలు వచ్చే కేవలం 30రోజుల్లోనే రాయలసీమ వాటా 110టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే తప్పనిసరిగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించాలన్నారు. రోజుకు 3టీఎంసీల చొప్పున రాయలసీమప్రాంత నీటివాటాను ఎత్తిపోతల ద్వారా సద్వినియోగం చేసుకొనేలా నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ చేపట్టారన్నారు. చంద్రబాబు, రేవంత్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ రాయలసీమ లిఫ్టుకు ఎగనామం పెట్టి ఇక్కడి ప్రజల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే అడ్డుకుంటామన్నారు. సాగునీటి నిపుణలు రాయలసీమ లిఫ్టు ప్రయోజనకరమని పేర్కొంటుంటే చంద్రబాబు అవసరంలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నీటిప్రాజెక్టులపై ఏమాత్రం అవగాహనలేని నిమ్మలరామనాయుడు రాయలసీమ లిఫ్టు అవసరం లేదని చెప్పడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తిచేయాలని, లేకపోతే అన్ని పార్టీలు, వామపక్షపార్టీలు, రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.


