నకిలీ జీతాల బిల్లుల కేసులో వైద్యశాఖ ఉద్యోగి అరెస్ట్
ఆళ్లగడ్డ: నకిలీ జీతాల బిల్లులు పెట్టుకుని రూ. కోట్ల ప్రభుత్వ నిధులు కాజేసిన కేసుకు సంబంధించి వైద్యశాఖ ఉద్యోగి ఇంతియాజ్ అలీఖాన్‌ను గురువారం ఆళ్లగడ్డ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ.. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన ఏజీ ఆడిట్‌లో 2020 నుంచి 2023 మధ్య కాలంలో అహోబిలం, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నకిలీ జీతాల బిల్లులు సృష్టించి రూ. 1,00,16,901 ఆళ్లగడ్డ సబ్‌ట్రెజరీ నుంచి అక్రమంగా డ్రా చేసినట్లు తేలింది. ఈ మేరకు నంద్యాల జిల్లా ట్రెజరీ అధికారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అహోబిలం, నరసాపురం ప్రాథమిక వైద్యశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అలీఖాన్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. వైద్యాధికారులైన డాక్టర్ నాగదాసయ్య, డాక్టర్ మునిసుధావాణిలకు సంబంధించిన నకిలీ రబ్బరు వేలిముద్రలు, హెచ్‌పీ ల్యాప్‌ట్యాప్, మొబైల్ పోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 93 నకిలీ బిల్లులు సృష్టించి రూ 1.94 కోట్లు డ్రా చేసి వీటిని తన సోదరి మొహతాబ్ బున్నీసా బేగం ఖాతాకు జమ చేయడం చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐ రమణ, ఎస్సై వరప్రసాద్‌లు ఉన్నారు.


