ఏప్రిల్ 1 నుంచి ‘విబి–జి రామ్ జి’
నంద్యాల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం విబి–జి రామ్ జి (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్) కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో 20 పాయింట్ ఫార్ములా అమలుపై జిల్లా స్థాయి సమీక్ష గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ‘విబి–జి రామ్’ జి విధానంలో లేబర్, మెటీరియల్, పరిపాలనా వ్యయాలను కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులతో భరిస్తుందన్నారు. ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 125 రోజుల వరకు పెంచారన్నారు. పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధికి వివిధ దశల్లో మంజూరైన నిధులను మార్చి 31 నాటికి పూర్తిగా వినియోగించాలన్నారు. సమగ్ర శిక్ష ద్వారా జిల్లాలో 1.39 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద ఎస్సీ, బీసీ కాలనీల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద బ్యాంకర్లు లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వలసల రామకృష్ణ, డీఆర్‌ఓ రాము నాయక్, సీపీఓ ఓబులేసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


