ప్రిన్సిపాల్, పీఈటీ మాకొద్దు
గోస్పాడు మోడల్ స్కూల్‌లో విద్యార్థినుల ఆందోళన
వ్యక్తిగతంగా అవమానిస్తున్నారని ఆరోపణ
గోస్పాడు: గోస్పాడు మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ ఖాజాహుసేన్, పీఈటీ గీతావాణిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. విద్యార్థినులతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, విద్యార్థులను గ్రూపులుగా విభజించి విబేధాలు సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు. పాఠశాలలో వారు పనిచేస్తే తాము పాఠశాలకు రాలేమని ముక్తకంఠంతో నినాదాలు చేశారు. పాఠశాలలో వారితో కాకుండా ఇతర ఉపాధ్యాయులతో మాట్లాడినా ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ప్రిన్సిపాల్‌ను చుట్టుముట్టడంతో ఉద్రిక్తతత నెలకొంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి పాఠశాలలో రాలేదని ఇప్పుడెందుకు వస్తుందని నిలదీశారు. సమాచారం అందుకున్న ఎంఈఓలు అబ్దుల్ కరీం, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. పీఈటీ గీతావాణి సెలవులో వెళ్లారని ఎంఈఓ తెలిపారు.
డీఈఓ విచారణ: మోడల్ స్కూల్‌లో విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న డీఈవో జనార్దన్‌రెడ్డి గురువారం పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడారు. నివేదిక తయారు చేసి పంపాలని ఎంఈఓను ఆదేశించారు.
ప్రిన్సిపాల్, పీఈటీ మాకొద్దు


